కలం, వరంగల్ బ్యూరో : వర్ధన్నపేట (Wardhannapet) ఎమ్మెల్యే నాగరాజు (MLA Nagaraju) బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హనుమకొండ సుబేదారిలోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలతో తడబడుతున్నారని అన్నారు. కవిత తీసుకుంటున్న నిర్ణయాలు, తాజా రాజకీయ పరిణామాలు కేటీఆర్‌ను అసహజ పరిస్థితుల్లోకి నెట్టాయని, ఆయన ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని, కానీ అదే ఉద్యమకారులను తర్వాత పక్కన పెట్టడం బాధాకరమన్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్‌గా మారుస్తామని చెబుతున్నారు. అయితే ప్రజలు ఇకపై వారి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాగ్దానం కూడా అమలు కాలేదని విమర్శించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రముఖ కవి కాళోజి నారాయణరావు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ, ప్రజలను మోసం చేసిన వారిని ప్రజలు తిరస్కరిస్తారని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇప్పటికే రాజకీయంగా తిరస్కరించారని అన్నారు.
‘బంగారు తెలంగాణ’ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దోపిడీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు అసత్యమని, అధికారంలోకి వచ్చిన తర్వాత 60 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలను ఆయన (MLA Nagaraju) ఖండించారు. ఈ సమావేశంలో KUDA చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామి రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: వివాదాలైనా… విధానాలైనా ఈ మంత్రులకు సాటి లేరు!
Follow Us On: Instagram

