కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మీర్పేట్ (Meerpet) పరిధిలోని నందనవనంలో గల ప్లాస్టిక్ గోదాంలో బుధవారం ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వేగంగా పక్కనే ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటలు భారీగా ఎగిసిపడినప్పటికీ, ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను విస్తరించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనతో భారీగా ఆస్తి నష్టం సంభవించినా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలిసిన మీర్పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

