Mobile Popup Ad
Mobile Popup Ad

ఓరుగల్లు రాణి రుద్రమలు: కార్పొరేషన్ నుంచి క్యాబినెట్ వరకు మహిళలదే హవా!

కలం, వరంగల్ బ్యూరో: ఓరుగల్లు (Warangal) అంటే పోరాటాల ఖిల్లా మాత్రమే కాదు.. నారీభేరి కూడా. పోరాటాల పురిటిగడ్డగా పేరున్న ఓరుగల్లులో ప్రస్తుతం మహిళా శకం నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు, కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారుల్లో మహిళలే అధికంగా ఉండటం విశేషం. ఓరుగల్లు ధీరవనిత రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా పాలనలో తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఈ నారీ శక్తి (Women Power) కారణంగా ఓరుగల్లు అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది.

పల్లె నుంచి క్యాబినెట్‌కు

ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్‌లో ఇద్దరు మహిళా మంత్రులున్నారు. ఆ ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క (Seethakka), కొండా సురేఖ వరంగల్ జిల్లా వాసులే. ఈ ఇద్దరు రాష్ట్ర రాజకీయాల్లో తమదైన వేస్తూ పరిపాలనలో ప్రత్యేకతను చాటుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీచేసిన యశస్వినిరెడ్డి 26 ఏళ్ల అతిచిన్న వయస్సులో ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం వరంగల్ ఎంపీగా కడియం కావ్య (Kadiyam Kavya) ఉన్నారు. 40 ఏళ్ల తర్వాత వరంగల్ ఎంపీగా ఓ మహిళ కడియం కావ్య గెలుపొంది స్త్రీ శక్తిని చాటారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వరంగల్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఎర్రబెల్లి స్వర్ణ ప్రస్తుతం రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్‌గా పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

జిల్లా పాలకులుగా..

వరంగల్ (Warangal) జిల్లా కలెక్టర్‌గా సత్యశరదాదేవి, హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా చాహత్ బాజ్ పాయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. అంతేగాకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆమె హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా సమర్థవంతంగా పనిచేశారు. సెంట్రల్ జోన్ డీసీపీగా కవిత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్టేషన్ ఘనపూర్‌లో ట్రైనీ ఐపీఎస్‌గా మనీషా నెహరా విధుల్లో ఉన్నారు. ఇలాంటి చారిత్రక జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉందని వీరంతా చెబుతున్నారు.

న్యాయమూర్తులుగా సైతం

మరోవైపు జిల్లా ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయస్థానంలోనూ మహిళలే న్యాయమూర్తులుగా ఎక్కువగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ కోర్టులకు జి. ప్రేమలత, పూజ, రితిక, చంద్రప్రసన్న, హారిక జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై విచారణ చేస్తూ నేరస్తులు తప్పించుకోకుండా కఠిన శిక్షలు అమలుచేస్తున్నారు. బాధితులకు మేమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు వీరంతా.

Read Also: ఎండల నుంచి ఉపశమనానికి ఆయుర్వేద చిట్కాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>