కలం, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో రాజకీయ అలజడి తీవ్రస్థాయికి చేరింది. పాక్ ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న ‘జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JAAC) ఇస్లామాబాద్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను పరిష్కరించడానికి 48 గంటల గడువు విధిస్తున్నామని తెలిపింది. ఆలోపు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివ వస్తుందని పాక్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.
ఈ మేరకు పాకిస్థాన్‌లో నివసిస్తున్న శరణార్థుల కోసం పీవోకే అసెంబ్లీలో కేటాయించిన 12 రిజర్వ్డ్ స్థానాలను రద్దు చేయాలని, కేవలం పీవోకే స్థానికులకే పూర్తి ప్రాతినిధ్యం ఉండాలని జేఏఏసీ పట్టుబడుతోంది. అలాగే ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించిన 600 మందికి పైగా సివిల్ రైట్స్ యాక్టివిస్టులను, టాప్ లీడర్లను తక్షణమే విడుదల చేయాలని.. పీవోకే ప్రజలపై విధించిన ఆహార, మందుల కొరత ను తొలగించి కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది.
కాగా, గత కొన్ని వారాలుగా పీవోకేలోని ముజఫరాబాద్, రావాలాకోట్, హవేలీ, పూంచ్ వంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న జేఏఏసీ (JAAC) సంస్థను పాకిస్తాన్ ప్రభుత్వం యాంటీ టెర్రరిజం యాక్ట్ (ఉగ్రవాద నిరోధక చట్టం) కింద నిషేధించడం అక్కడ మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రస్తుతం పీవోకే వ్యాప్తంగా “హమ్ లేకర్ రహేంగే ఆజాదీ” అనే నినాదాలు మార్మోగుతున్నాయ. ఈ నేపథ్యంలోనే జేఏఏసీ విధించిన 48 గంటల గడువు ముగిసేలోపు పాక్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠను రేపుతోంది.

