కలం, వరంగల్ బ్యూరో: మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మతిభ్రమించి మాట్లాడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) ఫైర్ అయ్యాడు. బుధవారం హనుమకొండ పార్టీ ఆఫీస్‌లో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు నకిలీ విత్తనాలు అమ్మిన ముఠా అని, బీఆర్ఎస్ హయాంలో 7 వేల మంది రైతులు చనిపోయారని మండిపడ్డారు. అలాంటి నేతలు సోనియాగాంధీ కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. కేటీఆర్ ముందుగా కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులను నట్టేటా ముంచిన చరిత్ర బీఆర్ఎస్‌ది అని, ధరణిని అడ్డంపెట్టుకుని తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే బద్మాష్ రాష్ట్ర సమితి అని విమర్శిస్తూ.. రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీదేనని గుర్తు చేశారు. ‘వరి వేస్తే ఉరే’ అని మీరు అంటే.. సన్నవడ్లకు బోనస్ ఇచ్చిన చరిత్ర మాదన్నారు. పదేండ్ల పాలనలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్శించే అర్హత లేదన్నారు.

