తుదిదశకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

కలం, వరంగల్ బ్యూరో :  ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న వరంగల్ (Warangal) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. జూన్ నాటికి ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలు స్థలంలో 56 ఎకరాల్లో రూ.1,371 కోట్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం సుమారు 400 మంది కార్మికులు మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తూ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న 24 అంతస్తుల ఈ భవనంలో 34 విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

హెల్త్ సిటీగా వరంగల్

వరంగల్‌ (Warangal) ను  రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే వైద్య రంగంలో కూడా నగరాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాజిపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీ, ధర్మసాగర్‌లో అంతర్జాతీయ క్రీడా మైదానం, మామునూరు విమానాశ్రయం అభివృద్ధి వంటి ప్రాజెక్టులతో పాటు, వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కీలకంగా మారనుంది.

ఉత్తర తెలంగాణకు భారీ మేలు

2021 జూన్ 21న ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వేగంగా పూర్తవుతోంది. ఆస్పత్రిలో మొత్తం 2208 పడకలు ఏర్పాటు చేయనున్నారు. సుమారు 500 మంది వైద్యులు, 1000 మంది నర్సులు, మరో 1000 మంది పారా మెడికల్ సిబ్బంది సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, డాక్టర్‌ల సమావేశ మందిరాలు, పీజీ విద్యార్థుల తరగతి గదులు వంటి సదుపాయాలు  కూడా కల్పిస్తున్నారు. ఈ  ఆసుపత్రి ప్రారంభమైతే వరంగల్ జిల్లాతో పాటు మొత్తం ఉత్తర తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: గడ్డి గొడవకు యూఈఎఫ్ఏ చెక్ !

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>