కలం, నేషనల్ డెస్క్ : Lok Sabha Seats | లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలు ఇకపైన 850కు పెరగనున్నాయి. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింధి. ఈ నెల 16 నుంచి వరుసగా మూడు రోజుల పాటు జరిగే ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలనుకుంటున్నది. ఈ మేరకు బిల్లు ముసాయిదా కాపీలు పార్లమెంటు సభ్యులకు అందాయి. మొత్తం 850 స్థానాల్లో 815 ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలు ఎన్నుకునేలా ఉంటాయి. మిగిలిన 35 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉంటాయి. అయితే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారా? లేక పార్లమెంటు ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని అమలులోకి తెస్తుందా? దీనిపై స్పష్టత రావాల్సి ఉన్నది.
డీలిమిటేషన్ (Delimitation) ప్రక్రియ ద్వారా లోక్‌సభలో సీట్ల (Lok Sabha Seats) సంఖ్యను పెంచేలా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. లోక్‌సభ స్థానాలను పునర్ విభజించేందుకు, సరిహద్దులను మార్చేందుకు, సీట్ల సంఖ్యను పెంచేందుకు జనాభాను ప్రాతిపదికగా తీసుకోనున్నది. ఏ జనాభా లెక్కల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటారన్నది పార్లమెంటు ఆమోదించిన చట్టం మేరకు ఉంటాయని ఆ బిల్లులో పేర్కొన్నది. కానీ 2011 లెక్కలను పరిగణనలోకి తీసుకుంటుందా?.. లేక ఇప్పుడు జరగబోతున్న సెన్సస్ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటుందా అనేది తేలాల్సి ఉన్నది. డీలిమిటేషన్ ప్రక్రియకు రాజ్యాంగంలోని 82వ అధికరణానికి సవరణలు జరగనున్నాయి. తప్పనిసరి డీలిమిటేషన్ చేయాలన్న ప్రొవిజన్‌ను తొలగించే అవకాశమున్నది. ఈ ఆర్టికల్‌లో 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నందున దాన్ని తొలగించేలా తాజా బిల్లులో సవరణ చేయనున్నట్లు తెలిసింది.
Read Also: లేటెస్ట్ సెన్సస్ ప్రాతిపదికగా డీలిమిటేషన్
Follow Us On: X(Twitter)

