కలం, వరంగల్ బ్యూరో: ఓరుగల్లు రాజకీయం రైతు కేంద్రంగా నడుస్తోంది. నిన్నటి వరకు రైతులంటే ముఖం చాటేసిన ఆయా పార్టీల నేతలు ఇప్పుడు పని గట్టుకుని మరీ వరంగల్(Warangal)కు క్యూ కడుతున్నారు. రైతులను కలుస్తూ వారి సాధకబాధలను విచారిస్తున్నారు. మీకు అండగా మేము ఉన్నామంటూ వాగ్దానాలు చేస్తున్నారు. నేతల తీరుపై ఆశ్చర్యపోవడం అన్నదాతల వంతవుతోంది. సహజంగా ఎన్నికలప్పుడు గ్రామాల్లోకి ఆయా రాజకీయ నేతల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే గడిచిన ఎన్నికల్లో చతికిల పడ్డ పార్టీలు రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటలని ఊవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాత కేంద్రంగా సరికొత్త రాజకీయం మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
హామీలతోనే సరి?
మేము అధికారంలోకి రాగానే వ్యవసాయాన్ని పండుగ చేస్తాం, రైతును రాజును చేస్తాం. ఈ మాటలు ఐదేండ్లకొసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయా పార్టీల నేతల నోటి వెంట వింటూనే ఉన్నాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతును పట్టించుకున్న నాథుడే కరువయ్యాడనే విమర్శలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయిన తర్వాత మరోలాగా వ్యవహరిస్తున్న నేతల తీరును రైతులు ఆక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా వరంగల్ (Warangal) కు రాజకీయ నేతల తాకిడి ఎక్కువైంది. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు రైతుపై వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారనే విమర్శలున్నాయి. మొన్నటి వరకు జిల్లాకు చెందిన నేతలుసైతం స్థానిక పరిస్థితుల దృష్ట్యా బాధిత రైతులను పలకరించిన పాపాన పోలేదనే వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. కానీ ఇప్పుడు పార్టీ పరంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందేందుకు పలువురు నేతలు జిల్లాకు వస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.
రైతు సభల పేరిట హంగామా
రైతు సంక్షేమమే మా ప్రధాన ధ్యేయమని చెప్పుకుంటున్న పార్టీలు రైతు సభల పేరిట హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బుధవారం హనుమకొండలో (Hanumakonda) రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వస్తున్నారు. దీంతో స్థానిక నేతల హడావుడి మొదలయింది. ఆయన వచ్చే మార్గంలో దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో రెచ్చిపోయిన కార్యకర్తలు మున్సిపల్ ఆఫీస్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అయితే కేటీఆర్ తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫ్లెక్సీలు కట్టొద్దని ఒకవేళ కట్టిన వారికీ జరిమానాలు విధించాలని చెప్పారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా లేకుంటే మరోలా ఉండడం వారికి చెల్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయ స్వార్థం కోసం నాయకులు రైతు జపం చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
Read Also: శ్రీరాముడిపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ
Follow Us On : WhatsApp

