కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని రాష్ట్ర బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవుని పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ (BJP) వాళ్లు మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అనడం తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. “జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడతాయా? లేకుండా ఏమైనా మనకు పైనుంచి పథకాలు వస్తున్నాయా? ఇంకేమైనా వస్తున్నాయా అంటే ఏమి లేదు. మోదీని (Modi) తీసుకొచ్చి మీటింగ్‌లు పెట్టి హిందీలో మాట్లాడిస్తారు. నినాదాలు చేయడం తప్ప బీజేపీ చేసేది ఏమీలేదు” అంటూ విమర్శించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదన్నారు. గతంలో గోదావరి పుష్కరాల కోసం ఏపీకి కోట్లాది రూపాయలు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా విదిల్చలేదని చెప్పారు.
కేంద్రం సహకరించకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్యాత్మిక రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సురేఖ తెలిపారు. పుష్కరాల కోసం సీఎం రూ. 4,200 కోట్లు కేటాయించి, ఇప్పటికే రూ. 1,400 కోట్లు విడుదల చేశారని వివరించారు. రాష్ట్రంలోని భద్రాచలం, వేములవాడ, బాసర వంటి పుణ్యక్షేత్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాలనలో రైతులను పట్టించుకోని బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు తమను ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ భగ్గుమంది. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కాదని.. దైవద్రోహ శాఖ మంత్రి అని ఘాటుగా స్పందించింది. శ్రీరాముడిపై మంత్రి కొండా సురేఖ అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిందని పేర్కొంది. ‘జై శ్రీరామ్’ నినాదాన్ని పైసలతో పోల్చుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలపై విషం చిమ్మారని మండిపడింది. హిందూ దేవుళ్లంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న చులకన భావానికి ఈ అహంకారపూరిత మాటలే సజీవ నిదర్శనమని పేర్కొంది.
పవిత్రమైన దేవాదాయ శాఖకు మంత్రిగా ఉండి.. దైవాన్నే అవమానించిన దారుణం అని విమర్శించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను కించపరచడమే కాంగ్రెస్ నాయకుల అసలు నైజం అంటూ చురకలు అంటించింది. కొండా సురేఖకు (Konda Surekha) దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఏమాత్రం లేదని.. తక్షణమే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
Read Also: గ్రేటర్ వరంగల్ ఎన్నికలు.. ప్రధాన పార్టీల ఫోకస్ వీరి మీదే..
Follow Us On : WhatsApp

