కలం, వెబ్ డెస్క్ : వరంగల్ నగరంలో పసిపిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న అంతర్ జిల్లా ముఠా గుట్టును కాజీపేట (Kazipet), టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సంచలన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మీడియా వేదికగా వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్ పాత్ పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న ఐదు నెలల పసిబాబు మల్లన్న కిడ్నాప్ కావడం నగరంలో కలకలం రేపింది. బాబు తండ్రి కన్నా నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కాజీపేట (Kazipet) రైల్వే స్టేషన్ సమీపంలో అద్దె కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన కొడుపాక నరేశ్, వెల్పుల యాదగిరిలు మరో కిడ్నాప్‌కు రెక్కీ నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. వీరు కేవలం మల్లన్ననే కాకుండా, గత రెండు సంవత్సరాలుగా వరంగల్, మంచిర్యాల, రామగుండం రైల్వే స్టేషన్ల పరిసరాల్లో నిద్రిస్తున్న మరో నలుగురు చిన్న పిల్లలను కూడా అపహరించినట్లు నేరాన్ని అంగీకరించారు. ఇలా కిడ్నాప్ చేసిన పిల్లలను సంతానం లేని దంపతులకు అనాథాశ్రమాల నుంచి తెచ్చామని నమ్మబలికి భారీ మొత్తానికి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు జన్నారం, నస్పూర్, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, కిడ్నాప్‌కు గురైన ఐదుగురు పసిపిల్లలను సురక్షితంగా రెస్క్యూ చేశారు. అలాగే చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా పిల్లలను కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రతిభ కనబరిచి పసిపిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్, కాజీపేట (Kazipet) పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కవిత, ఏసీపీలు మధుసూదన్, ప్రశాంత్ రెడ్డి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు పాల్గొన్నారు.
Read Also: మియాపూర్‌లో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
Follow Us On: Instagram


