కలం, వరంగల్ బ్యూరో : వరంగల్(Warangal) పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (CP Sunpreet Singh) ప్రతి వాహనదారుడు బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక యువత చేత ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా యువత వేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని సూచించారు.
సీపీ (CP Sunpreet Singh) మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రస్థాయిలో ఉందని, ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య హత్యల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడించారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుండటానికి వేగం, నిర్లక్ష్యం ప్రధాన కారణమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తూ, ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ నినాదంతో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మొత్తం 451 గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవితతో పాటు ఇతర పోలీస్ అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీలు, ఇన్స్‌పెక్టర్‌లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: షాకింగ్.. మే 1 నుంచి థియేటర్ల బంద్..?
Follow Us On: X(Twitter)

