కలం, ఖమ్మం బ్యూరో: ఆర్థిక సవాళ్ల మధ్య సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti) తెలిపారు. మంగళవారం మంత్రి, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో సుమారు 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. యంగ్ ఇండియా పాఠశాలలు అలాంటి ప్రధాన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటని, ప్రతి పాఠశాల సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడుతుందని తెలిపారు. అభివృద్ధి కేవలం కాగితాలపై కాకుండా క్షేత్ర స్థాయిలో కనిపించేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. యంగ్ ఇండియా పాఠశాలలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి పనులు పూర్తి చేయడానికి రైతులు సహకరించాలని, అవసరమైన చోట భూములు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అవసరమైన చోట ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూములు కూడా కల్పిస్తుందని మంత్రి పొంగులేటి (Ponguleti) తెలిపారు.
ఉత్తమ విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యం..
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty) మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సుమారు 100 యంగ్ ఇండియా పాఠశాలలను నిర్మిస్తుండగా, ఖమ్మం జిల్లాలో సుమారు 5 పాఠశాలలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ప్రతి పాఠశాల సుమారు 2,500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉత్తమ విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ఖమ్మం జిల్లాకు మంజూరైన 5 యంగ్ ఇండియా పాఠశాలలను వీలైనంత త్వరగా పూర్తి చేసే దిశగా కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
విద్యాభివృద్ధికి కేంద్ర బిందువు యంగ్ ఇండియా పాఠశాల..
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా యంగ్ ఇండియా పాఠశాలకు శంకుస్థాపన జరగడం చాలా ఆనంద దాయకమని తెలిపారు. ఇంత ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వమే ఇలాంటి పాఠశాలలను నిర్మిస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి వర్గం కలిసి ఒకేచోట 2,500 మంది విద్యార్థులు చదువుకునేలా ఈ పాఠశాలలను రూపకల్పన చేశారని తెలిపారు. ఈ యంగ్ ఇండియా పాఠశాల విద్యా అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుందన్నారు.
అనంతరం తల్లాడ మండలం బాలపేటలో 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, తల్లాడ గ్రామంలో 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుందర, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, మిషన్ భగీరథ ఈఈ లు పుష్పవతి, వాణిశ్రీ, తహసీల్దార్లు బ్రహ్మశ్వర్ రావు, కరుణాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: లేటెస్ట్ సెన్సస్ ప్రాతిపదికగా డీలిమిటేషన్
Follow Us On : WhatsApp

