కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామాన్ని(Mangampalli village) అన్ని విధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, జల సంరక్షణ, వర్షాకాల ముందస్తు చర్యలు, రోడ్డు భద్రత, బాల్యవివాహాల నివారణ, వన మహోత్సవం, పాఠశాల మౌలిక సదుపాయాలపై అధికారుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. మంగంపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతుగా రూ.10 లక్షలు కేటాయిస్తానని, జిల్లా కలెక్టర్ ద్వారా మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి సోలార్ సదుపాయం, ఇంకుడు గుంతల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామంలో ప్రతి కార్యక్రమంలో మొక్కలు నాటే విధానాన్ని ప్రారంభించాలని సూచించారు.
రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని, పామాయిల్ వంటి తోటల సాగుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. మహిళలు స్వయం ఉపాధి కోసం ముందుకు వస్తే రుణ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గ్రామంలో ఇంకుడు గుంతల ఏర్పాటు ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, మంచినీటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు. అర్హులైన వారు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా రూ.20 వేల లబ్ధి పొందవచ్చని చెప్పారు. బాల్యవివాహాల నివారణకు ప్రజలు సహకరించాలని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించి ఉన్నత విద్యావకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీడీవో పరిణత, ఎస్సై జలంధర్ రెడ్డి, వార్డు సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు, ప్రజలు, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

