కలం, వెబ్ డెస్క్ : రైతు డిస్కం ఏర్పాటుపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు శనివారం మీడియా చిట్ చాట్ లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అగ్రికల్చర్ మోటార్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా ఎన్నికల్లో పోటీ చేయబోమని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అని సీఎం సవాల్ విసిరారు. రాజకీయంగా లబ్ది పొందడం కోసం రైతుల ముసుగులో కేసీఆర్ లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని రేవంత్ విమర్శించారు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు మాత్రమే రైతు డిస్కం ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కంకు కనెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్ట మొదటిసారిగా తెలంగాణలో రైతు డిస్కంను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుందని.. ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కేంద్రం వల్లే రాష్ట్ర రైతుల ఇబ్బందులు..
బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు పండించిన ప్రతీ గింజను తమ ప్రభుత్వం కొంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నదెంత..? కేంద్రం కొనేది ఎంత అని ప్రశ్నించారు. కేంద్రం మద్దతు ధర నిర్ణయించింది కానీ ఒక్క గింజనైనా కొంటుందా అని నిలదీశారు. తాము కొన్న మొత్తం పంటను కేంద్రం కొనాల్సి ఉంటుంది. కానీ కేంద్రం కొనుగోలు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొనకపోతే బస్సులు వేసుకుని వెళ్లిన వాళ్ల దగ్గరికే ట్రాక్టర్లు వేసుకుని వెళ్తామని బీజేపీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేశారు. కానీ, తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా స్పందించడం లేదు అని సీఎం రేవంత్ ఆరోపించారు.

