Mobile Popup Ad
Mobile Popup Ad

పాలమూరు రైతులకు ఉత్తమ్ కీలక హామీ

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో:  ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగా‌రెడ్డి లిఫ్ట్‌ లిరిగేషన్ ప్రాజెక్టు‌తోపాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టు‌లు పూర్తి చేస్తామని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 32.05 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డిలతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. అజిలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌తో అజిలాపురం, గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాలకు 1400 ఎకరాల ఆయకట్టుకు కోయిల్ సాగర్ సోర్స్ నుండి సాగు నీరు అందుతుందన్నారు.

గత ప్రభుత్వంలో పాలమూరుపై వివక్ష

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, తదితర ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 90 శాతం పూర్తిచేశామని చెప్పటం అబద్ధమన్నారు. ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని అన్నారు. జూన్ 4, 5 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తో పాటు తాను ఉమ్మడి జిల్లాలో నిర్మాణంలో ఉన్న లైఫ్ ఇరిగేషన్ పనులు,పెండింగ్ పనులు పరిశీలించి అవసరమైన నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

సీఎంతో కలిసి పెండింగ్ ప్రాజెక్టులు పరిశీలిస్తా

జూన్ 4, 5 తేదీల్లో తాను సీఎం రేవంత్ రెడ్డి  కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, నార్లాపూర్, ఉద్దండాపూర్ రిజర్వాయర్‌లను పరిశీలిస్తామని ఉత్తమ్ వెల్లడించారు. భూ సేకరణ, పెండింగ్ పనులకు ఎన్నివేల కోట్ల నిధులైనా మంజూరు చేస్తామన్నారు. పెండింగ్ బిల్లులకు సైతం నిధులు విడుదల చేస్తామన్నారు. కొడంగల్ నారాయణ‌పేట, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పనులు ప్రభుత్వం వచ్చే రెండున్నర ఏండ్లల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు.

చౌదర్‌పల్లి లిఫ్ట్ గిరిగేషన్ మంజూరు చేస్తాం

ఎమ్మెల్యే  మధుసూదన్ రెడ్డి కోరిన విధంగా చౌదరిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కోయిల్ సాగర్ కాలువల మరమ్మతులకు 150 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దీంతో 22 వేల ఎకరాలకు అదనంగా సాగు నీరు అందించవచ్చన్నారు. చౌదరిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్‌కు 87 కోట్ల ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ, ఎస్‌పీడీ జానకి, సర్పంచ్ అనంతమ్మ, మాజీ జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రం సందర్శన

అజిలా‌పూర్ శివారులో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు, ఎంఎస్‌పీ చెల్లింపు‌పై రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని.. తమ ఖాతాల్లో నగదు జమ అవుతోందని రైతులు మంత్రులకు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>