కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణంలోని గాంధీచౌక్ పాతకోట వద్ద నిరుపయోగంగా ఉన్న కందకం కూరగాయల మార్కెట్ (Kandakam Market) ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. గురువారం మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. మార్కెట్ నిర్మించినా వినియోగంలోకి రాకపోవడంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.
మార్కెట్‌లోని వసతులు, పరిసరాల పరిశుభ్రత, వినియోగంలోకి రాకపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా మార్కెట్ మొత్తాన్ని శుభ్రం చేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అవసరమైన కనీస వసతులు కల్పించాలని సూచించారు. పట్టణంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వారాంతపు సంతను కందకం మార్కెట్‌కు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సంతను తరలించిన అనంతరం పెండింగ్ పనులను పూర్తిచేసి వ్యాపారులు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మార్కెట్‌ను ప్రజలకు ఉపయోగపడేలా సద్వినియోగంలోకి తీసుకురావడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, కమిషనర్ నిరంజన్, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

