కలం, తెలంగాణ బ్యూరో: లక్ష్యంపై గురి పెడితే పేదరికం అడ్డుకాదని నిరూపించింది తెలంగాణ బిడ్డ చికిత తానిపర్తి (Chikitha Taniparthi). జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో చికిత సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం జరిగిన వేర్వేరు ఆర్చరీ పోటీల్లో ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి, ఆసియా గేమ్స్ లో భారత్ తరఫున తొలి ‘డబుల్ గోల్డ్ మెడలిస్ట్’గా రికార్డులకెక్కింది. చికిత సాధించిన ఈ విజయాల వెనుక ఆమె తండ్రి, పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పడిన కష్టం వర్ణనాతీతం.
పొలం తాకట్టు పెట్టి..
ఎనిమిదేళ్ల కింద చికితకు ప్రొఫెషనల్ ఆర్చరీ విల్లు అవసరమైంది. దాని ధర అక్షరాలా రూ.3.5 లక్షలు. అంత డబ్బు లేకపోవడంతో, ఆయన తనకున్న మూడు ఎకరాల పొలాన్ని తాకట్టు పెట్టారు. స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద నెలకు 2 శాతం వడ్డీకి అప్పు చేసి కూతురికి విల్లు కొనిచ్చారు. ఇప్పుడు ఆ విల్లుతో కూతురు దేశం గర్వించేలా చరిత్ర సృష్టిస్తుంటే.. ఆ అద్భుత క్షణాలను కళ్లారా చూసే భాగ్యానికి కూడా ఆ తండ్రి నోచుకోలేదు.
శ్రీనివాసరావు ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు. ఆయన వాడుతున్నది ఒక సాధారణ నోకియా కీప్యాడ్ ఫోన్. పొలంలో నాట్లు వేస్తుండగా.. స్నేహితుడు ఫోన్ చేసి అప్‌డేట్స్ ఇస్తుంటే ఆయన ఆనందపడ్డారు. కూతురి ప్రతిభపై నమ్మకంతో శ్రీనివాసరావు మొండిగా ముందుకెళ్లారు. చికితను ఢిల్లీ తీసుకెళ్లి మాజీ భారత ఆర్చర్ అభిషేక్ వర్మను కలిశారు. ఆయన ప్రోత్సాహంతో 2021లో హర్యానాలోని సాయ్ అకాడమీలో చేరిన చికిత.. అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఆసియా ఖండాన్నే జయించింది.
ఒకే రోజు రెండు స్వర్ణాలు
బుధవారం ఉదయం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతికా ప్రదీప్తో కలిసి చికిత భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించింది. ఆ విజయం అందించిన ఉత్సాహంతో.. గంట వ్యవధిలోనే జరిగిన మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో సాహిల్ జాదవ్ తో జతకట్టి రెండో స్వర్ణాన్ని ముద్దాడింది. ఈ అద్భుత విజయాలతో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కు చికిత అర్హత సాధించడం విశేషం. గురువారం జరగబోయే వ్యక్తిగత విభాగంలోనూ బరిలోకి దిగుతున్న చికిత.. హ్యాట్రిక్ గోల్డ్‌పై కన్నేసింది.
భావితరాలకు స్ఫూర్తి: సీఎం
చికిత సాధించిన ఈ విజయం ఈ చారిత్రాత్మక విజయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిరంతర సాధన, పట్టుదల, దృఢసంకల్పంతో సాధించిన ఈ విజయం తెలంగాణ క్రీడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని, భావితరాల క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన చికిత ప్రతిభను ప్రారంభంలోనే గుర్తించి, ఆమెను వెన్నంటి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కోచ్‌కు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. చికితకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు.

