Mobile Popup Ad
Mobile Popup Ad

‘సర్’తో తెలంగాణలో సెటిలర్ల ఓట్లు డౌటేనా?

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’తో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో  ఎన్ని ఓట్లు గల్లంతవుతాయి?.. ఎవరి ఓట్లు పోతాయి? అని అన్ని పార్టీల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలామందికి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లు ‘మ్యాపింగ్’ టైమ్‌లో వెల్లడైంది. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో సెటిలర్ ఓటర్లు చాలామందే ఉండగా.. ఏపీ నుంచి వచ్చినవాళ్లే ఎక్కువ. వీరిలో అనేక మంది అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ ఓటర్ల జాబితాలో ఉన్నారు. జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో పార్టీలన్నీ సెటిలర్ల ఓట్లపై స్పెషల్ ఫోకస్ పెడుతుంటాయి. అయితే, ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు సెటిలర్లు తమ ఓటును తెలంగాణలో రద్దు చేసుకుంటే ఎలా?.. అని ఇక్కడి పార్టీలు కలవరపడుతున్నాయి.

కేసీఆర్ ‘ముందస్తు’ వెనుక వ్యూహం అదే..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే సెటిలర్లు ఏపీకి వెళ్లి ఓటేస్తుంటారు. సరిగ్గా ఈ ఉద్దేశంతోనే 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్నారు. 2018 సెప్టెంబర్ 6న నాటి సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. తొమ్మిది నెలల పాలనా పీరియడ్ మిగిలి ఉండగానే 2018 సెప్టెంబర్ 6న నాటి సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. సెటిలర్ల ఓట్లు చేజారొద్దనే వ్యూహం దీని వెనుక దాగి ఉందని విశ్లేషణలు వెలువడ్డాయి. హైదరాబాద్ శివారులోని సెటిలర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో ఓటు వేస్తున్నారు. 2018, 2023 అసెంబ్లీ, 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతమే సాక్ష్యం. ‘సర్’ ప్రక్రియతో డబుల్ ఓట్ల ఎంట్రీ ఉండదు. ఒక్కడో ఓ చోట మాత్రమే ఓటు ఉంటుంది. సెటిలర్లు తమ రాష్ట్రంలోనే ఓటు ఉంచుకోవాలని భావిస్తే.. ఆ మేరకు కొన్ని పార్టీలపై ప్రభావం పడనుంది.

వారికి రెండేసి ఓట్లు..

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఎల్బీనగర్, ఉప్పల్, మహేశ్వరం, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి సహా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెటిలర్ ఓటర్లు ఎక్కువ. ఇటీవల బూత్ లెవల్ ఆఫీసర్లు ‘సర్’ ప్రక్రియలో భాగంగా చేపట్టిన మ్యాపింగ్ ప్రీ-ఎక్సర్‌సైజ్‌లో డబుల్ ఎంట్రీ ఓటర్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటింటికీ వెరిఫికేషన్ చేసి వివరాలను నమోదు చేసేటప్పుడు పూర్తిస్థాయి వివరాలు తేలనున్నాయి. ఎక్కడ ఉంచుకోవాలనేది ఓటర్ల నిర్ణయమే. కానీ ఒక చోట మాత్రమే ఉంటుందని, మిగిలిన చోట్ల డిలీట్ అవుతాయని స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్పష్టం చేస్తున్నారు.

శివారు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువ..

జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ పర్సంటేజీని గమనిస్తే.. సెటిలర్ల ఓటు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో 7-8 శాతం తేడా ఉంటుండగా, కొన్నిచోట్ల కనీసంగా 3 శాతం ఉంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజీ 50 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. ‘సర్’ ప్రక్రియ ముగిసిన తర్వాత విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాతో 20 లక్షల పేర్లు జాబితా నుంచి డిలీట్ కావచ్చని అంచనా. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు లాభంగా మారడంతో ఇప్పుడు ‘సర్’ సర్వేతో ఆ పార్టీ అప్రమత్తమైంది. సెగ్మెంట్ల వారీగా రివ్యూలు పెడుతోంది. ఇతర పార్టీలు కూడా అదే తీరుతో ముందుకు వెళ్తున్నాయి. సెటిలర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.

2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పర్సెంటేజీలు

నియోజకవర్గం        అసెంబ్లీ         లోక్‌సభ
శేరిలింగంపల్లి        48.62%        41.17%
రాజేంద్రనగర్        56.91%        48.82%
మహేశ్వరం           55.35%        47.59%
మేడ్చల్               60.73%        56.04%
మల్కాజిగిరి           53.20%        49.59%
కుత్బుల్లాపూర్        56.06%         49.14%
కూకట్‌పల్లి            57.82%         50.16%
ఉప్పల్                51.66%         45.81%
ఎల్బీనగర్             49.58%         43.94%
జూబ్లీహిల్స్            45.60%        39.39%

 

2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పర్సెంటేజీలు

నియోజకవర్గం       అసెంబ్లీ           లోక్‌సభ
శేరిలింగంపల్లి        48.95%          43.52%
రాజేంద్రనగర్        56.43%         53.92%
మహేశ్వరం           56.05%         52.46%
మేడ్చల్               62.79%         57.44%
మల్కాజిగిరి           54.29%          51.37%
కుత్బుల్లాపూర్        57.45%         49.87%
కూకట్‌పల్లి            54.07%         47.78%
ఉప్పల్                51.94%         48.08%
ఎల్బీనగర్             49.73%         45.84%
జూబ్లీహిల్స్            47.58%          45.37%

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>