కలం, వెబ్ డెస్క్: దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Election)తో పాటు ఒడిశా ఉప ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నేడు అధికారికంగా వివరాలను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ నుండి తాయి తగాక్, మణిపూర్ నుండి శారదా దేవి, మధ్యప్రదేశ్ నుండి తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ బరిలోకి దిగుతున్నారు. అలాగే రాజస్థాన్ నుండి అల్కా గుర్జర్, డా.సతీష్ పూనియాను పార్టీ ఎంపిక చేసింది.
మరోవైపు గుజరాత్ రాష్ట్రం నుండి నలుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. వారిలో రాజుభాయ్ శుక్లా, ముకేశ్‌భాయ్ రాథ్వా, మాన్‌సింగ్ పర్మార్, జితేంద్ర మేఘ్‌జీ భాయ్ కంజారియా ఉన్నారు. వీటితో పాటు ఒడిశాలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా దేబాశీష్ సామంతరాయ్ పేరును ఖరారు చేశారు. ఈ అభ్యర్థుల ఎంపిక ప్రకటనను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్ అధికారికంగా విడుదల చేశారు. జూన్ 18న దేశ వ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కమిషన్ అదే రోజు ఫలితాలు విడుదల చేయనుంది.

