కలం, స్పోర్ట్స్: తనను ‘విదేశీ ఆటగాడు’ అని పిలుస్తున్న అభిమానులకు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. గత కొంతకాలంగా కోహ్లీ (Virat Kohli) తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఎక్కువ సమయం గడుపుతుండటంతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆయన ఒక అదనపు విదేశీ ఆటగాడిలా ఆడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. దీనిపై కోహ్లీ నవ్వుతూ స్పందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆర్‌సీబీ (RCB) కంటెంట్ క్రియేటర్ డానిష్ సేట్ (మిస్టర్ నాగ్స్) ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన తెచ్చారు. ఆర్‌సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడుతోందన్న అభిమానుల వాదనపై ప్రశ్నించగా.. తాను విదేశీ ఆటగాడిని కాదని, ఈ ప్రశ్న తనను ఎందుకు అడుగుతున్నారని కోహ్లీ నవ్వుతూ బదులిచ్చారు. తాను నిజంగానే విదేశీ ప్లేయర్‌లా కనిపిస్తున్నానా అంటూ వెటకారంగా తిరిగి ప్రశ్నించారు. ప్రస్తుతం 37 ఏళ్ల కోహ్లీ అంతర్జాతీయ టీ20లు, టెస్టులకు దూరమైనా, వన్డేలు, ఐపీఎల్‌లో మాత్రం తన జోరు కొనసాగిస్తున్నారు.
గత సీజన్‌లో ఎట్టకేలకు టైటిల్ గెలవడంపై కోహ్లీ (Virat Kohli) తన మనసులోని మాటను పంచుకున్నారు. ఆ విజయం తనపై ఉన్న పెద్ద భారాన్ని దించినట్లు అనిపించిందని, ఆ రాత్రి ఎంతో ప్రశాంతత లభించిందని తెలిపారు. 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో కూడా కోహ్లీ అజేయంగా 69 పరుగులు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంలో కీలక పాత్ర పోషించారు. గెలుపు అనేది మనం పడే కష్టానికి, చేసే త్యాగాలకు లభించే గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. ఓటముల నుండి చాలా నేర్చుకోవచ్చని, అయితే విజయం సాధించినప్పుడు కలిగే ఆ తృప్తి మరింత కష్టపడేందుకు ప్రేరణనిస్తుందని కోహ్లీ చెప్పుకొచ్చారు.
Read Also: రహానే నంబర్ 3లో రావాలి: మురళీ కార్తీక్
Follow Us On: Sharechat

