కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) సీజన్ కొనసాగుతోంది. మూడు విడతల్లో నిర్వహించనున్న పోలింగ్ కు నామినేషన్ల గడువు ముగిసింది. ఎలాగైన పదవి దక్కించుకోవాలని కొందరు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా హామిలు ఇస్తున్నారు. మరోవైపు ఏకగ్రీవం హవా నడుస్తోంది. లక్షలు దారపోసి సర్పంచ్ పదవికి వేలం వేస్తున్నారు. ఇప్పటికే వందలాది గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఓ గ్రామంలో విచిత్ర పరిస్థితికి వేదికగా మారింది. సిద్దిపేట జిల్లాలోని పాండవపురం గ్రామంలో ఏకగ్రీవం బెడిసికొట్టి గ్రామస్తులపై కేసు నమోదయ్యేలా చేసింది.
పాండవపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేసే క్రమంలో చట్టవిరుద్దంగా వ్యవహరించారన్న ఆరోపణలతో 35మందికిపై గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఏకగ్రీవం కోసం గ్రామస్తులు వేలం వేశారు. అందే శంకరయ్య అనే వ్యక్తి రూ.16 లక్షలకు వేలంపాట ద్వారా సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. దీంతో ఎవరు కూడా నామినేషన్ వేయొద్దు అని పెద్దలు నిర్ణయించి ఆదేశాలు జారీ చేశారు.
అయితే, బైరి రాజు అనే వ్యక్తి ఏకగ్రీవానికి ముందు ఒప్పుకున్నట్లు చేసి తరువాత నామినేషన్ దాఖలు చేశాడు. దీంతో అగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు రాజును కుల బహిష్కరణ చేశారు. ఈ తతంగానికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. సమాచారం అందుకున్న పోలిసులు నామినేషన్ వేసిన బైరి రాజును వేధించడంతో పాటు, ఎన్నికల సంఘం నియమాలకు విరుద్దంగా వ్యవహరించిన 35 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


