epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గ్లోబల్‌ సమ్మిట్.. హైదరాబాద్‌ లో స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్‌ (Global Summit) నిర్వహణకు రాష్ట్రం ముస్తాబవుతోంది. ఈ నెల 8, 9 తేదీల్లో భారత ఫ్యూచర్‌ సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఓ వైపు, తెలంగాణ ప్రత్యేక ఎట్రాక్షన్స్ మేళవింపుతో జరుగుతున్న ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక.. ఇలా అన్ని చోట్లా హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో ప్రత్యేకంగా పెట్టుబడుల పండగ వాతావరణం సృష్టించనున్నారు.

చార్మినార్ తో పాటు కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సెక్రటేరియట్ వద్ద అద్భుతమైన త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ ‌తో రాష్ట్ర అభివృద్ధి తీరును, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించడానికి ప్రణాళిక రూపొందించారు. రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్ ప్లేలు ఉండనున్నాయి. దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో (Global Summit Logo)ను ఇన్‌లిట్ టెక్నిక్ ‌తో అద్భుతంగా ప్రదర్శించనున్నారు.

హుస్సేన్ సాగర్ ‌లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ప్రభుత్వం చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత–రైతు ప్రధాన కార్యక్రమాలు, మూడు ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం లాంటి ముఖ్య అంశాలను చూపించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే అప్రోచ్ రోడ్డుపై భారీ డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్ల మీద భారత్ ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి.. ఎంత దూరం.. వంటి వివరాలు పొందుపరుస్తారు. నగర వ్యాప్తంగా గ్లోబల్ సమ్మిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలతో వేడుక వైభవాన్ని చాటనున్నారు.

సమ్మిట్ వేదిక వద్ద లోపలికి వెళ్లే మార్గం మొత్తం ఆధునిక త్రీడీ ఎనీమార్ఫిక్ డిజైన్లు రూపొందిస్తున్నారు. 50 మీటర్ల పొడవుతో డిజిటల్ టన్నెల్ ‌ను ఇంటరాక్టివ్ డిస్ ప్లే రూపంలో ఏర్పాటు చేసి, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పురోగతిని విజువల్స్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పది వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్ ను సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో గ్లోబల్ సమ్మిట్ ‌కు సంబంధించిన వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమ్మిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడున్న వలంటీర్లు ప్రజలకు సమ్మిట్ డైలీ షెడ్యూల్ ‌ను వివరించి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరి దృష్టిని ఆకర్శించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది.

Read Also: ప్రపంచంలోనే అతిపొడవైన ఎయిర్‌ రూట్.. చైనా రికార్డ్‌

Follow Us On : Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>