epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

దీనావస్థలో కేసీఆర్.. సర్పంచ్‌లను ఇంటికి పిలుస్తుండు..

కలం బ్యూరో, నల్లగొండ:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరోసారి మాజీ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌(KCR)ను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేశారు. గతంలో బాగానే బతికిన కేసీఆర్ ఇప్పుడు దీనావస్థలో ఉన్నారని వ్యాఖ్యానించారు. తన గడీ ముందుకొచ్చిన మంత్రులను కూడా గేటులోకి రానియకుండా తరిమికొట్టిన కేసీఆర్.. ఇప్పుడు సర్పంచ్ లను వెంటపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ దీనావస్థలో ఉన్నడు. పాపం.. గతంలో బానే బతికిండు. తన గడీ ముందుకొచ్చిన మంత్రులను కూడా మెడల మీంచి కొట్టిండు.. ఇప్పుడేమో సర్పంచ్ లను, వార్డు మెంబర్లను వెంట బెట్టుకుని మనకు మంచి రోజులు వస్తయని చెబుతుండు.’ అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

దేవరకొండ(Devarakonda) నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పదేండ్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత.. నలుగురు కలిసి నాలుగు దిక్కులా పీక్కుతిన్నారన్నారు. ‘రైతుల నెత్తిలో అప్పు పెట్టిండ్రు.. చేతిలో చిప్ప పెట్టిండ్రు.. కేసీఆర్ ఏమో ఫామ్‌హౌజ్‌లో పండిండు’ అంటూ ఆరోపించారు. కేసీఆర్ ఇకనైనా ఆలోచన చేయాలని, కేటీఆర్ ఓ గుదిబండ అని, ఆయన ఉంటే పార్టీని బొంద పెట్టుడేనని జోస్యం చెప్పారు. కేసీఆర్ పార్టీ పెట్టేందుకు జాగా ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే.. కనీసం పరార్శించలేదని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా అంటేనే చైతన్యమని, ఇక్కడి ప్రాంత గాలికి.. నీటికి పోరాట పౌరుషం ఉందని స్పష్టం చేశారు. నిజాం నవాబులు ఇక్కడి ప్రజలను పీడిస్తున్నప్పుడు.. దోపిడీ చేస్తున్నప్పుడు ఈ ప్రాంత విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసిన ఘనత నల్లగొండదని గుర్తు చేశారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి పేర్లును ప్రస్తావించకపోతే నల్లగొండ చరిత్ర అసంపూర్ణమని చెప్పారు. అందుకే కేసీఆర్ గడీల పాలనను ఇక్కడి ప్రజలు ఓటు అనే ఆయుధంగా కూల్చివేశారన్నారు.

కేసీఆర్ పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదని, ఇంటికి కొత్త కోడలు వస్తే కనీసం రేషన్ కార్డులో పేరు చేర్చాలనే సోయి గత పాలకులకు లేకుండా పోయిందన్నారు. చెప్పులు అరిగేలా తిరిగినా పేదలకు రేషన్ కార్డు ఇయ్యలేదని, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే, తండాలు, గుడాలు, మారుమూల పల్లెల్లో ప్రతిఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చామని, కొత్త పేర్లు చేర్చామని చెప్పుకొచ్చారు. ఒక్క దేవరకొండ నియోజకవర్గంలోనే 14వేల రేషన్ కార్డులు ఇచ్చామని, రాష్ట్రంలోనే అత్యధిక రేషన్ కార్డులు దేవరకొండకే దక్కాయని తెలిపారు. నాటి ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే.. బర్రెలకు దాణాగానో.. రేషన్ దుకాణాల్లో అమ్ముకునేటోళ్లని చెప్పారు. ‘దేవరకొండ వేదికగా సవాల్ చేస్తున్నా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం ఇయ్యట్లే.. మోదీ రాష్ట్రం గుజరాత్‌లోనూ సన్నబియ్యం ఇయ్యట్లేదని, పేదలను మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

నియోజకవర్గానికి 3500 ఇండ్లు..

కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేశాడని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. కేసీఆర్ మాత్రం 10 ఎకరాల్లో రూ.2వేల కోట్ల ఖర్చుతో 105 గదులతో గడీని నిర్మించుకున్నారన్నారు. పేదలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించామని, గిరిజన ప్రాంతాలకు అదనంగా 25వేల ఇండ్లను అధికంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. గత పదేండ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే.. 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు కట్టేటోళ్లమన్నారు. కేసీఆర్‌ను గెలిపించి పదేండ్లు మోసపోయామని, నిజాన్ని గుర్తించి దేవరకొండ ప్రజలు 45వేల మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించారని కొనియాడారు. కేసీఆర్‌కు పేదల పట్ల ప్రేమాభిమానాల్లేవని, కానీ ఈ ప్రభుత్వం పేదలది.. లంబాడీలది.. ఆదివాసీలదని స్పష్టం చేశారు. దేవరకొండలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలవడమే కాకుండా గిరిజనులను ఎస్టీ జాబితాలో చేర్చేలా కృషి చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, వ్యవసాయాన్నిదండుగ కాదు.. పండుగ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని కేసీఆర్ ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు ఎక్కడా కరెంట్ పోవడం లేదన్నారు. ఉచిత కరెంటు అంటనే కాంగ్రెస్‌కు పెటెంట్ హక్కు అని, రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు రెండేండ్ల క్రితమే మంచి రోజులొచ్చాయి. ఆడ పిల్లలు అమ్మగారి ఇంటికి పోవాలన్నా.. అమ్మవారిని దర్శించుకోవాలన్నా.. మహాలక్ష్మీ పథకం జర్నీ ఆడబిడ్డలకు పనికొస్తుందన్నారు.

ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తాం.. : సీఎం Revanth Reddy

కేసీఆర్ పదేండ్ల పాటు కక్షగట్టి.. పగబట్టి.. ఎస్‌ఎల్‌బీసీ పడావు పెట్టాడని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్‌బీసీ(SLBC) ప్రాజెక్టు పూర్తయితే.. దేవరకొండ ప్రాంతంలో ఫ్లోరైడ్ పీడ వదులుతుందని, అందుకే కేసీఆర్ టన్నెల్ పనులను నిర్లక్ష్యం చేశారని చెప్పారు. ఏడాదికో కిలోమీటరు చొప్పున టన్నెల్ తవ్వినా ఈపాటికే ఎప్పుడో పూర్తయ్యేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టన్నెల్ పనులు చేపట్టిందన్నారు. ప్రమాదవశాత్తు 8 మంది చనిపోతే.. మామ.. అల్లుడు పైశాచిక ఆనందం పొందారని పేర్కొన్నారు. ఎస్ఎల్‌బీసీతో పాటు డిండి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తామని, ఈ హయాంలోనే ప్రాజెక్టుల కంప్లీట్ చేస్తామని, నీళ్లు పారినట్టు దేవరకొండకు నిధులు పారించి అభివృద్దఇ చేస్తామన్నారు. దేవరకొండ ప్రభుత్వ కాలేజీకి రూ.6 కోట్లు ఇస్తామని, వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు ఇస్తామని, దేవరకొండ‌కు నర్సింగ్ కాలేజీని ఇస్తామని, అంచనాలు రెడీ చేయాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు.

దేవరకొండకు మంత్రులను పంపిస్తా

దేవరకొండకు త్వరలోనే మంత్రులను పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి పల్లె నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు, మండల కేంద్రం నుంచి నియోజకవర్గ కేంద్రానికి డబుల్ రోడ్డు, దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తామని హామీనిచ్చారు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే మంత్రులు దేవరకొండకు వస్తారని, లంబాడీ సోదరుల కోసం సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని మద్దిమడుగులో ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాబోయే పదేండ్లు మనమే అధికారంలో ఉంటామని, పదేండ్లు నష్టపోయాం.. మోసపోయాం.. నమ్మించి నట్టేట ముంచే మాటకారులకు ఓటు వేయోద్దని స్పష్టం చేశారు. మంచోళ్లు.. అభివృద్ధికి పనికొచ్చేటోళ్లను సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని సూచించారు.

Read Also: గ్లోబల్‌ సమ్మిట్.. హైదరాబాద్‌ లో స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌

Follow Us On : Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>