కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఒక మూడో శక్తి అత్యంత అవసరమని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) అన్నారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ రెండు పార్టీలు విభజన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. కేవలం కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించడమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని, అధికారం కోసం ఎన్డీయే లేదా ఇండియా కూటముల్లో దేనితోనైనా పొత్తులు పెట్టుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా ఉంటాయని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు, జగన్ ఆలోచన అదే..
రాష్ట్రంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు కేవలం తమ కుటుంబ స్వప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. నారా లోకేష్‌ను సీఎం చేయాలనే తపన చంద్రబాబుకు ఉంటే, తన కుటుంబ సభ్యులను పీఠంపై కూర్చోబెట్టడమే జగన్ ఆలోచన అని వ్యాఖ్యానించారు. గడిచిన 12 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు కూడా రాలేదని, రెండు కుటుంబాల పాలన ఫలితంగా యువతకు దక్కింది కేవలం నిరుద్యోగమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
కమ్మ, క్రిస్టియన్లకే అధికారమా?
రాష్ట్రంలో విభజన జరిగినప్పటి నుంచి అధికారం కేవలం రెండు వర్గాల చేతుల్లోనే ఉండిపోయిందని విజయసాయిరెడ్డి తెలిపారు. కమ్మ, క్రిస్టియన్ సామాజిక వర్గాలకే అధికారం పరిమితమైందని, దీంతో రెడ్లు, బీసీ, ఎస్సీ, కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఒకవైపు టీడీపీకి కులపిచ్చి, మరోవైపు వైసీపీకి మతపిచ్చి పట్టుకున్నాయని విమర్శించారు.
వైసీపీపై సంచలన ఆరోపణ
దేశ, రాష్ట్ర విభజనలకు కాంగ్రెస్ పార్టీయే మూలకారణమని, గతంలో జగన్‌ను జైలులో పెట్టింది కూడా ఆ పార్టీయేనని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అధికార దాహంతో అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని సంచలన ఆరోపణ చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నానని స్పష్టం చేశారు.

