కలం, నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని, వరి పంటలు ఎండిపోవడానికి కారణమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchander Rao) మండిపడ్డారు. బుధవారం బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన నల్గొండ (Nalgonda) జిల్లాలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడమే తమ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం నల్గొండలో నిర్వహించిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో రాంచందర్ రావు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. సేవా భావం, స్వచ్ఛత అనేవి విస్తృత ప్రజా ఉద్యమంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ స్ఫూర్తిని ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని, సమాజం, దేశ సేవకు అంకితభావంతో పనిచేయాలని ఆయన కోరారు.
అనంతరం రాంచందర్ రావు నాగార్జునసాగర్‌కు బయలుదేరారు. అక్కడ పంట నష్టపోయిన రైతులను స్వయంగా కలిసి వారి బాధలను, సమస్యలను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు బీజేపీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

