కలం, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. స్థానిక కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి కృష్ణవేణి (Hindupur CTO Krishnaveni) ఒక చిరువ్యాపారి నుంచి పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వ్యాపారి నుంచి ఆమె నేరుగా డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు సెల్ఫోన్ కెమెరాలో రికార్డు కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
హిందూపురం పట్టణంలోని వ్యాపారుల నుంచి సీటీఓ కృష్ణవేణి గత కొంతకాలంగా నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తనిఖీల పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిణి వ్యవహారశైలిపై స్థానిక వ్యాపార వర్గాల్లో అసంతృప్తి నెలకొంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని వ్యాపారులు కోరుతున్నారు. లంచం తీసుకున్న వ్యవహారంతో పాటు చిరువ్యాపారులపై జరుగుతున్న ఒత్తిళ్లపై పూర్తిస్థాయి విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

