కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌లోని చర్లపల్లి ఆత్మహత్యల కేసు (Charlapalli Suicide Case)లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయా రెడ్డి (Vijaya Reddy) తన ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఒంటరితనం వల్లే పిల్లలను బలవంతంగా తీసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా విచారణలో తేల్చారు. అయినా ఇప్పటికీ ఆమె ఆత్మహత్యకు గల కారణాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా విజయా రెడ్డి భర్త సురేందర్ రెడ్డి (Surender Reddy) చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. తన భార్య కుటుంబ సభ్యుల నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను ఆశ్రయించారు.
నా భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్లు కాదు..
తన భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్లు కాదని.. ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల వల్లనే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి తెలిపారు. వాళ్లు చనిపోయిన కొద్దిరోజులకే ఆమె కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం తనను వేధించారని, కాబట్టి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. తమ అత్త పుష్పలత, బామ్మర్ది చిరంజీవిలే కారణమని పేర్కొన్నారు. సొంత వాళ్లే నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఆస్తి కోసమే తన కుటుంబాన్ని తనకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య, పిల్లలు చనిపోయిన బాధలో తానుంటే 25 రోజులకే తనకు బెదిరించారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఒకవేళ తాను చనిపోతే.. తన ఆస్తి మొత్తం తల్లిదండ్రులకి, ట్రస్ట్ కి రాస్తానని సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే విజయా రెడ్డి చనిపోయినప్పుడే ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపనలు వెల్లువెత్తాయి. దుబాయిలో ఉద్యోగం చేస్తున్న సురేందర్ రెడ్డి.. తన భార్య, పిల్లలు చనిపోయారని తెలుసుకున్నాక తర్వాత ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో పోలీసులు ప్రశ్నించగా.. ఆయన కూడా తమ కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణం తెలియదని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని జవాబిచ్చారు. తామంతా అన్యోన్యంగానే ఉన్నట్లు పోలీసులకు వివరించారు. ఈ తరుణంలో తాజాగా ఆయన చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
Read Also: పోచారం కామెంట్స్‌పై మంత్రి పొన్నం రియాక్షన్
Follow Us On : WhatsApp

