కలం, వెబ్ డెస్క్: పెళ్లికూతురు కోసం ఇద్దరు పెళ్లి కొడుకులు వివాహ మండపానికి చేరుకున్నారు. దీంతో అంతా షాక్ అయ్యారు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఈ వివాదాన్ని సెటిల్ చేశారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని అమ్రోహా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అమ్రోహాలోని ఒక ఫంక్షన్ హాల్‌లో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి కొడుకుకు వస్తే స్వాగతం పలికేందుకు వధువు తరఫు బంధువులు అక్కడికి చేరుకున్నారు. అయితే సంభల్ ప్రాంతానికి చెందిన వరుడి కోసం బంధువులు ఎదురుచూస్తుంటే.. ఒకేసారి ఆ పెండ్లి మండపానికి ఇద్దరు పెండ్లి కొడుకులు వచ్చారు. సంభల్ ప్రాంతానికి చెందిన పెళ్లికొడుకుతోపాటూ మొరాదాబాద్ నుంచి కారులో మరో పెళ్లికొడుకు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ తామే అసలైన వరులమని వాదించడంతో పెళ్లి వేదిక వద్ద హైడ్రామా జరిగింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
అసలేం జరిగింది?
వధువుకు మొరాదాబాద్‌కు చెందిన పెళ్లి ఖాయం చేసుకొని నిశ్చితార్థం కూడా చేశారు. కానీ ఇరు కుటుంబాల మధ్య నెలకున్న తగాదాతో నిశ్చితార్థం రద్దై పెళ్లి ఆగిపోయింది. నిశ్చితార్థం రద్దయినప్పటికీ, అప్పటికే పెళ్లి పత్రికలు పంచేశామన్న కారణంతో మొరాదాబాద్ కుటుంబం మొండిగా పెళ్లి వేదికకు చేరుకుంది. అయితే వధువు తల్లిదండ్రులు ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. ఇతర ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోకూడదన్న కారణంతో సంభల్ కు చెందిన మరో వరుడితో వెంటనే పెళ్లి నిశ్చయం చేసుకొని అదే ముహూర్తానికి వివాహం జరుపుతున్నారు. కానీ ఇద్దరు పెళ్లి కొడుకులు రావడంతో గందరగోళం నెలకొన్నది. పోలీసులు రంగప్రవేశం చేసి ఎవరిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని వధువు కుటుంబానికే వదిలేశారు. వధువు కుటుంబం తాము కొత్తగా నిశ్చయించుకున్న సంభల్ వరుడితోనే వివాహం జరిపించాలని నిర్ణయించుకుంది. దీంతో మొరాదాబాద్ బృందం చేసేదేమీ లేక వెనుదిరిగింది.
Read Also: డ్రైఫ్రూట్స్ ఎక్కువ తిన్నా బరువు పెరుగుతామా?
Follow Us On : WhatsApp

