కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తొలిసారి ఎన్నికల భారీలో నిలిచి ప్రచారం ముమ్మరం చేసిన TVK పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Vijay)కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై విజయ్ పై చెన్నైలోని పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌తో పాటు సుమారు 5 వేల మంది పార్టీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టారు.
ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో నిబంధనలకు విరుద్ధంగా విజయ్ 30 లౌడ్ స్పీకర్లను వినియోగించారని, అంబులెన్స్ ప్రయాణానికి ఆటంకం కలిగించారని కుమార్ లిఖితపూరకంగా పెరవల్లూరు (Peravallur) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 5,000 మందికి పైగా జనాలను పోగుచేసి ప్రజలకు అసౌకర్యం సృష్టించడం ద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.
మానిటరింగ్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రజలకు అసౌకర్యం, రవాణాను అడ్డుకోవడం, చట్టవిరుద్ధంగా అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువమందిని సమీకరించడం సహా అయిదు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు పెరవల్లూరు పోలీసులు తెలిపారు. విజయ్‌తో పాటు దాదాపు 5,000 మంది టీవీకే పార్టీ కార్యకర్తలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు ఎన్నికల (Tamil Nadu Elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అక్కడి వాతావరణం వేడెక్కుతోంది. రాజకీయ కక్ష్యలో భాగంగానే తమ అధినేత విజయ్ పై కేసు నమోదు చేశారని TVK పార్టీ నేతలు అంటున్నారు . పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విజయ్ సోమవారం (మార్చి 30న) నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో ఆయన రోడ్ షోకు పోలీసులు భద్రత కల్పించలేదని, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేదని ఆరోపిస్తున్నారు. చెన్నై పోలీసులు తమకు భద్రత కల్పిస్తూ, తమ ప్రచారాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని టీవీకే విజ్ఞప్తి చేసింది. ప్రచారం చేసుకోవడానికి అనుమతి పొందిన తర్వాత కూడా విజయ్‌కు భద్రత కల్పించలేదని చెబుతున్నారు.
Read Also: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. ట్రంప్ సంచలన నిర్ణయం!
Follow Us On: Instagram

