బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. కౌషిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

కలం, వెబ్ డెస్క్: హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)కి ఊహించని షాక్ తగిలింది. జనవరిలో జరిగిన ఒక వివాదాస్పద ఘటనకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ రాష్ట్ర సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నూతన చట్టం భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) లోని సెక్షన్ 35(3) ప్రకారం ఈ నోటీసులు అందజేసినట్లు సమాచారం. హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జనవరి 29వ తేదీన హుజూరాబాద్‌లోని కేసీ క్యాంప్ చౌరస్తాలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలే ఈ నోటీసులకు ప్రధాన కారణం. ఆ రోజు బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు అడ్డుతగలడంతో పాటు, కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) తన అనుచరులతో కలిసి రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, కరీంనగర్ పోలీస్ కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని కేసులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని కూడా అధికారులు ఆధారంగా తీసుకున్నారు.

సమగ్ర విచారణ కోసం ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఎమ్మెల్యేను ఆదేశించారు. విచారణకు వచ్చే సమయంలో తన వెంట గుర్తింపు కార్డులు, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు కేసుకు సంబంధించిన ఇతర కీలక పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. విచారణాధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఒకవేళ విచారణకు గైర్హాజరైతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు హెచ్చరించారు.

Read Also: ఇండోనేషియా కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బ్యాన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>