కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ దర్యాప్తును టీవీకే చీఫ్ విజయ్(Vijay Thalapathy).. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ మేరకు ఆయన సిట్ దర్యాప్తుకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు విజయ్. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో పోలీసుల దర్యాప్తు, అధికారుల పాత్రపై తాము ఇప్పటికే ప్రశ్నలు లేవనెత్తామని, అయినా హైకోర్టు వారితోనే సిట్‌ను ఏర్పాటు చేసిందని విజయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కరూర్(Karur)లో టీవీకే నిర్వహించిన రోడ్ షోలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి సిట్ దర్యాప్తు జరగాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా విజయ్‌పై మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. విజయ్‌కు నాయకత్వ లక్షణాలు లేవని పేర్కొంది. తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్, టీవీకే నేతలు అక్కడి నుంచి పారిపోయారని వ్యాఖ్యానిస్తూ ఆ పార్టీ తీరును తీవ్రంగా ఖండించింది. ఘటన తర్వాత అన్ని పార్టీలు సహాయక చర్యలు చేపడితే టీవీకే నేతలు మాత్రం వెళ్లిపోయారంటూ తప్పుబట్టింది న్యాయస్థానం. ఈ విషయాన్ని, మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలను కూడా టీవీకే తన పిటిషన్‌లో ప్రస్తావించింది. ఆ వ్యాఖ్యలు ఇప్పటికే దర్యాప్తును ప్రభావితం చేశాయని, తన ర్యాలీలో ఇబ్బందులు కలిగించడం కోసం ముందస్తు కుట్రలను తోసిపుచ్చలేమని విజయ్(Vijay Thalapathy) తన పిటిషన్‌లో ఆరోపణలు చేశారు.

