ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలంటే ఏ జీవికి అయినా విటమిన్లు చాలా ముఖ్యం. అందులోనూ విటమిన్-డీ(Vitamin D) తగ్గితే అనేక సమస్యలు ఉంటాయి. ఇది శాఖాహారం నుంచి లభించదు. అందుకే విటమిన్-డీ లోపం రాకుండా చూసుకోవడం ఉత్తమం అని వైద్యులు చెప్తారు. మాంసాహారం తినేవారికి ఈ సమస్య తక్కువగా ఉంటుందని, శాఖా హారులే విటమిన్-డీపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు. శరీరంలో విటమిన్-డీ స్థాయిలు తగ్గితే మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెప్తున్నమాట. చాలా మంది విటమిన్-డీ తగ్గితే ఎముకల బలహీనత మాత్రమే సంభవిస్తుందని అనుకుంటారని, కానీ ఇది మెదడును కూడా దెబ్బతీస్తుందని చెప్తున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా విటమిన్-డీ లోపం కారణం కావొచ్చు.
మానసిక, మెదడు ఆరోగ్యానికి విటమిన్-డి చాలా ముఖ్యం. విటమిన్-డి తగ్గితే జ్ఞాపకశక్తి మందగించడం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. విటమిన్-డి.. మెదడులోని న్యూరాన్ల పనితీరుకు దోహదపడుతుంది. మెదడులోని కొన్ని భాగాల్లో విటమిన్-డి గ్రాహకాలు ఉంటాయని, అవి సెరటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయిన వైద్యులు వివరిస్తున్నారు. ఈ హార్మోన్లు మన భావోద్వేగాలను నియంత్రిస్తాయి. మెదడులో న్యూరోప్రొటెక్టివ్, యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ పాత్రను విటమిన్-డీ పోషిస్తుంది. ఇది సెరోటోనిన్ హార్పోన్ ఉత్పత్తిని పెంచి, న్యూరాన్‌ల మధ్య కనెక్షన్‌ను మెరుగుపరుస్తుంది. విటమిన్-డి లోపం డిమెన్షియా, డిప్రెషన్, ఆటిజం, స్కిజోఫ్రెనియా వంటి సమస్యలకు కారణం కావచ్చని అధ్యయాలను చెప్తున్నాయి.
అసలు Vitamin D ఎందుకు లోపిస్తుంది…
విటమిన్-డి లోపానికి ప్రధాన కారణం తగినంత సూర్యకాంతి శరీరానికి తగలకపోవడం. జీవనశైలి, విటమిన్‌ను శరీరం గ్రహించలేకపోవడం వంటివి కూడా కారణాలు కొవొచ్చు. ఇలాంటి కారణాలు ఇంకా ఉన్నాయి. అవేంటంటే..
తక్కువ సూర్యకాంతి: మన శరీరం సూర్యరశ్మి నుంచి విటమిన్-డిని తయారు చేసుకుంటుంది. కాబట్టి మనం ఎండలో ఉన్నంత సేపు కూడా చర్మం ద్వారా సూర్యరశ్మిని గ్రహించి.. దాని నుంచి విటమిన్-డి తయారు చేసుకుంటుంది. విటమిన్-డి లోపం నుంచి బయట పడాలి అంటే రోజుకు 30 నిమిషాల పాటు సేపు సూర్యుని ఎండలో నిల్చోవాలని వైద్యులు చెప్తున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయితే సూర్యుని ఎండలో యూవీ-బీ కిరణాలు అధికంగా ఉంటాయని, అవి విటమిన్-డి తయారీకి చాలా బాగా ఉపయోగపడతాయిన వైద్యులు చెప్తున్నారు.
ఆహారంలో లోపం: విటమిన్-డి తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, విటమిన్-డి ఉండే ఆహారాలకు ఎక్కువ కాలం దూరంగా ఉండటం వల్ల కూడా ఈ విటమిన్ లోపం వస్తుంది.
జీవనశైతి: ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం లేదా కొన్ని జీవనశైలి పరిమితులు సూర్యరశ్మికి గురికావడాన్ని తగ్గిస్తాయి. అలాంటి వారిలో విటమిన్-డి లోపం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్యులు చెప్తున్న మాట.
అయితే మరికొందరిలో వారి శరీరం.. సూర్యరశ్మి నుంచి, ఆహారం నుంచి విటమిన్-డిని సరిగా గ్రహించలేకపోవచ్చు. వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమ మార్గం.

