ఆర్‌సీబీ విజయంపై విజయ్ మాల్యా ప్రశంసల వర్షం

కలం, వెబ్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ (IPL) ఫైనల్‌కు దూసుకెళ్లడంపై ఆ ఫ్రాంచైజీ మాజీ యజమాని విజయ్ మాల్యా (Vijay Mallya) సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల తేడాతో ఓడించి ఆర్‌సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ అద్భుత విజయంపై మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన బెంగళూరు సింహాలు ధర్మశాలలో గట్టిగా గర్జించాయని, ఫైనల్లోకి ఘనంగా ప్రవేశించాయని ఆయన కొనియాడారు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ తన ఐదో ఐపీఎల్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రజత్ పటిదార్ కేవలం 33 బంతుల్లోనే 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఆరంభంలో వచ్చిన లైఫ్‌లను వాడుకుంటూ ఆయన గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో పటిదార్ విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో ఆర్‌సీబీ చివరి 5 ఓవర్లలో 86 పరుగులు, ఆఖరి 6 ఓవర్లలో ఏకంగా 114 పరుగులు రాబట్టింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు పవర్‌ప్లేలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఓపెనర్ సాయి సుదర్శన్ 14 పరుగుల వద్ద జేకబ్ డఫీ బౌలింగ్‌లో విచిత్రమైన రీతిలో అవుటయ్యారు. షాట్ ఆడే క్రమంలో ఆయన చేతిలోంచి బ్యాట్ జారి వికెట్లపై పడింది. ఆ వెంటనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 2 పరుగులకే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ వికెట్‌తో భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్‌లో 26 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ 29 పరుగులకు అవుట్ కాగా, రసిఖ్ సలామ్ ఒకే ఓవర్లో నిశాంత్ సంధు, జేసన్ హోల్డర్‌లను అవుట్ చేశారు. దీంతో గుజరాత్ జట్టు 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 8 పరుగులకే అవుట్ కాగా, ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ తెవాటియా 68 పరుగులతో పోరాడారు. చివరికి గుజరాత్ టైటాన్స్ 162 పరుగులకు ఆలౌట్ అయింది. లీగ్ స్టేజ్‌లో టాప్‌లో నిలిచిన ఆర్‌సీబీ, అదే జోరుతో ఇప్పుడు ఫైనల్ పోరుకు సిద్ధమైంది.

Read Also: చెమటకాయలు, దురదలకు గుడ్‌బై చెప్పే సహజ ఔషధం ఇదే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>