కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati )అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరిద్దరిపై సీఐడీ నమోదు చేసిన క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. చంద్రబాబు, నారాయణలపై మోపిన ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టంతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసులు చట్టబద్ధంగా చెల్లదంటూ స్పష్టం చేస్తూ హైకోర్టు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.
ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ..
2014 – 15 కాలంలో అమరావతి రాజధాని ప్రాంతంలో దళితులకు చెందిన సుమారు 1,100 ఎకరాల అసైన్డ్ భూములను బెదిరించి, ల్యాండ్ పూలింగ్ నిబంధనలకు విరుద్ధంగా బలవంతంగా బలవంతంగా లాక్కున్నారని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇందులో రూ. 4,400 కోట్ల మేర అవినీతి జరిగిందని తెలిపారు. వైసీపీ హయాంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నాటి సీఎం చంద్రబాబు ని ఏ 1గా, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఏ2గా చేర్చుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
క్రిమినల్ కేసులు ఎలా పెడతారు?
అయితే ఈ ఎఫ్ఐఆర్, సీఐడీ దర్యాప్తును సవాల్ చేస్తూ చంద్రబాబు, నారాయణలు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా.. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత హైకోర్టు ధర్మాసనం తాజాగా వారిద్దరికి ఊరట కలిగించింది. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని జీవో జారీ చేస్తే, దానిపై క్రిమినల్ కేసులు ఎలా పెడతారు? అంటూ హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చారని పేర్కొంటూ ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

