కలం, వెబ్ డెస్క్ : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సున్నితంగా తిరస్కరించారు. ప్రభుత్వ గౌరవాలను తాము అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం బతికున్న సమయంలో తీవ్రంగా అవమానించి, ఇబ్బందులకు గురిచేసిన వారు, ఇప్పుడు ఆయన మరణానంతరం ప్రదర్శించే అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదంటూ కుటుంబ సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయానికి సంబంధించిన వివరాలను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేత జక్కంపూడి రాజా మీడియాకు వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం ఎన్నడూ అధికారం కోసం గానీ, పదవుల కోసం గానీ పాకులాడిన వ్యక్తి కాదని, తన జీవితాంతం ప్రజల కోసమే పోరాడారని రాజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. బతికుండగా గౌరవించని ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎలాంటి లాంఛనాలు ఆశించడం లేదన్న కుటుంబ సభ్యుల ఆవేదనను ఆయన సమర్థించారు.

