కలం, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన టీవీకే అధినేత విజయ్ (Vijay).. ఇప్పుడు మీడియా రంగం మీద ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సొంతంగా ఛానెల్ ఏర్పాటు చేయబోతున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రధాన మీడియా తమకు పెద్దగా కవరేజ్ ఇవ్వలేదనే విషయాన్ని విజయ్ టీం గుర్తించిందట. రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేకు ఇప్పటికే సొంతంగా పలు మీడియా సంస్థలున్నాయి. న్యూట్రల్ మీడియాపైనా వాటి ఆధిపత్యమే ఉండటంతో.. విజయ్‌కు అసలు కవరేజ్ ఇవ్వలేదని అప్పట్లోనే చర్చ జరిగింది. దీంతో, సోషల్ మీడియాపైనే ఆధారపడి, అత్యధిక స్థానాలు గెలుచుకోగలిగింది. ప్రధాన మీడియా అండ లేకపోతే.. రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది తప్పదనే విజయ్.. సొంతంగా మీడియా పెట్టాలని భావిస్తున్నాడని సమాచారం.
ఆ విషయాన్ని విజయ్ గుర్తించారా..?
డీఎంకే, అన్నాడీఎంకే ప్రభావిత మీడియా తనకు సంబంధించిన ప్రతి విషయంలో నెగిటివ్ ప్రచారం పెద్ద ఎత్తున చేసిందని విజయ్‌కు పార్టీ ప్రచార విభాగం రిపోర్ట్ ఇచ్చిందని టాక్. కరూర్ తొక్కిసలాట, భార్యతో విడాకుల అంశం, పార్టీ గుర్తుపై వివాదం, జననాయగన్ మూవీ… ఇలా ప్రతి కీలక అంశంలో తనను టార్గెట్ చేసి ప్రజల్లో తనపై నెగిటివిటీ పెరిగేలా ప్రధాన మీడియా దుష్ప్రచారం చేసిందని టీవీకే నేతలు సైతం బలంగా నమ్ముతున్నారు. అందుకే, ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ ఒక్క మీడియా సంస్థకు కూడా ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని సొంతంగా మీడియా ఏర్పాటు చేసుకోవాలని ఫిక్సయ్యారట.

