కలం, నేషనల్ డెస్క్: భారతదేశ పర్యటనలో ఉన్న వియత్నాం అధ్యక్షుడికి (Vietnam President) కేంద్ర ప్రభుత్వం ఘనంగా ఆతిథ్యం ఇచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో భారతీయ సంస్కృతిని, భౌగోళిక విశిష్టతను చాటిచెప్పేలా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధ ఆహార పదార్థాలను వడ్డించారు.
ముఖ్యంగా బీహార్‌కు చెందిన మిథిలా మఖానా, హాజీపూర్ మాల్‌భోగ్ అరటి పండ్లతో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ రత్నగిరి ఆల్ఫాన్సో మామిడి పండ్లు ఈ విందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల రుచులను అంతర్జాతీయ అతిథులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ మెనూ సిద్ధం చేశారు.
బీహార్‌లోని మిథిల ప్రాంతంలో పండే నాణ్యమైన తామర గింజలు (మఖానా), హాజీపూర్ ప్రాంతానికి చెందిన అత్యంత తీపి రకమైన మాల్‌భోగ్ అరటి పండ్లు వియత్నాం ప్రతినిధులకు ప్రత్యేక అనుభూతిని అందించాయి. వీటితో పాటు పండ్ల రాజుగా పిలువబడే రత్నగిరి ఆల్ఫాన్సో మామిడి పండ్ల రుచిని కూడా అధ్యక్షుడు ఆస్వాదించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే కాకుండా.. భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ఇలాంటి ప్రయత్నాలు ఎంతో దోహదపడతాయని దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.

