కలం, వెబ్ డెస్క్: రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన అవకాశంతోనే ఇప్పుడు స్పీకర్ చైర్‌లో ఉన్నవారుగానీ, ఇక్కడే ఉన్న కడియం శ్రీహరి, తనలాంటి ఎంతో మంది ఈ సభలో సభ్యులుగా ఎన్నికయ్యారని, కానీ వారిపట్ల కనీస గౌరవం ప్రదర్శించకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy)పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు విప్ వేముల వీరేశం (Vemula Veeresham) విజ్ఞప్తి చేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్న సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని హత్యచేస్తామని, చంపేస్తామంటూ పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించడాన్ని తప్పుపట్టారు.
కౌశిక్‌రెడ్డి హావభావాలు, సైగలు వీడియో ఫుటేజీలో కనిపిస్తాయని, వాటిని పరిశీలించాలని స్పీకర్‌ను కోరారు. సభలోనే సభ్యులుగా తమకు భద్రత, రక్షణ లేనప్పుడు బయట ఎలాంటి రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సభలో సభ్యులందరినీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత స్పీకర్‌దేనన్నారు. ఒక నిండు శాసనసభలో హెచ్చరించినందున ఈ సభ నుంచి కౌశిక్‌రెడ్డి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలన్నారు. అదే దళిత సభ్యులుగా తమకు రక్షణ కల్పిస్తుందన్నారు.
మొదటినుంచీ దళితులపట్ల అమానవీయ ధోరణి
గత శాసనసభలో దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను, ఇప్పుడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కేవలం నిరసన వ్యక్తం చేసినందుకు, ప్రశ్నించినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ సూచనతో అప్పటి స్పీకర్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వేముల వీరేశం గుర్తుచేశారు. ఇప్పుడు నిండు సభలో సభ్యులకు జరిగిన అవమానం, దుర్మార్గమైన ప్రవర్తనతో మొత్తం సమాజమే తల దించుకునేలా చేసిందన్నారు. సభా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌దేనన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న దళిత సభ్యుడినీ ప్రతిపక్ష సభ్యులు గౌరవించడంలేదన్నారు. స్పీకర్ చైర్‌ను కూడా గౌరవించకపోవడంలోని వారి ఆలోచన, వ్యవహారం స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన ఆరోపణలపై ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చినా నిర్దిష్టంగా ఒక మంత్రిని టార్గెట్ చేసే తీరులో ప్రవర్తించడం ఉద్దేశపూర్వకంగానే సభను నడవనీయకూడదనే కుట్ర బీఆర్ఎస్ సభ్యుల్లో ఉన్నదని ఆరోపించారు.
పాపాలు బయటపడతాయనే భయం
పదేండ్ల పాలనలో నీళ్ళను, బొగ్గును, బూడిదను, చివరకు ఇసుకను కూడా దోచుకున్నారని బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) నిప్పులు చెరిగారు. ఇప్పుడు వాటిపై సీబీసీఐడీ ఎంక్వయిరీ జరిగితే వారి దోపిడీ, నేరాలు, ఘోరాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే సభ జరగనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షం బడ్జెట్‌పైనా, పద్దులపైనా చర్చ జరుగుతూ ఉంటే ప్రజలకు అవసరమైన అంశాలను ప్రస్తావించి సూచనలు, సలహాలు ఇవ్వడానికి బదులు డిబేట్ జరగకుండా ప్రవర్తించడంలోని ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
బాధ్యత కలిగిన ప్రతిపక్షం సహకరించడానికి బదులు బాధ్యతారాహిత్యంగా నిరసనలు తెలియజేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకోవడం వెనక కుట్ర ఉన్నదన్నారు. గడచిన పదేండ్లలో ఉద్యమకారుల్ని గౌరవించకపోగా మోసం చేశారని ఆరోపించారు. అమరవీరులు 1200 మంది అని చెప్తూనే సగం మందిని మాత్రమే పట్టించుకుని నిర్లక్ష్యానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలను తప్పుపట్టారు. చివరకు తనపైన కూడా డజను కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. మనుషులు, సమాజం పట్ల విలువ లేకపోగా సభ పట్ల గౌరవం కూడా లేని దుర్మార్గమైన ఆలోచన వారిదని అన్నారు.
Read Also: హనుమంతుడి విగ్రహానికి నమస్కరించిన వానరం
Follow Us On: X(Twitter)

