కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Khammam SIR) ప్రక్రియలో ఊహించని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో ఏకంగా 1,57,854 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి సమర్పించకపోవడం తీవ్ర కలకలం రేపింది. లక్షన్నర మందికి పైగా ఉన్న ఈ ఓటర్ల హక్కులు గాల్లో దీపంలా మారాయా లేదా అసలు ఓటర్లే లేరా అనే సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశాల మేరకు యంత్రాంగం క్షేత్రస్థాయి విచారణ చేపట్టింది. ఈ విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే వివరాలు బయటపడ్డాయి.
ఫారాలు సమర్పించని లక్షన్నర మందిలో సుమారు 33,380 మంది ఓటర్లు ఇప్పటికే మరణించినట్లు అధికారులు తేల్చారు. మరో 11,004 మంది డబుల్ నమోదైన ఓటర్లు కాగా, ఏకంగా లక్షకు పైగా (1,01,000) మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లినట్లు స్పష్టమైంది. సాంకేతిక సమస్యలు, ఇతర అవాంతరాల వల్ల మరో 11 వేల మంది ఓటర్లు సమయానికి ఫారాలు సమర్పించలేకపోయారు. అంటే మరణించినవారు, డూప్లికేట్లు, వేరే చోటికి వెళ్లినవారే ఈ పెద్ద సంఖ్యకు ప్రధాన కారణమని ఎస్ఐఆర్ విచారణ తేల్చింది.
మరోవైపు జిల్లాలో సేకరించిన 10.85 లక్షలకుపైగా దరఖాస్తులను డిజిటలైజేషన్ చేయగా, అందులో 1.32 లక్షల (10.67 శాతం) ఫారాల్లో తీవ్రమైన సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. పేర్ల స్పెల్లింగ్, తల్లిదండ్రులు-పిల్లల మధ్య వయస్సు వ్యత్యాసం 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండటం లాంటి తప్పులను అధికారులు గుర్తించారు. వీటిని కేవలం సమాచార లోపాలుగా వదిలేయకుండా, బీఎల్ఓలు మళ్లీ క్షేత్రస్థాయికి వెళ్లి నిజానిజాలు నిర్ధారించుకున్నాకే సవరణలు చేయనున్నారు. అలాగే మ్యాపింగ్ సరిగా లేని 43 వేల మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. పుట్టిన తేదీ ఆధారంగా తగిన ధృవపత్రాలు స్వీకరించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ మొత్తం వ్యవహారంపై బుధవారం జిల్లా కలెక్టర్ స్పందించారు. నిజమైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల ఫారాలు సమర్పించలేకపోయిన అర్హులైన పౌరులకు ఆగస్టు 17న ప్రచురించే ముసాయిదా ఓటరు జాబితా నుంచి మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. వేరే ప్రాంతంలో ఓటు లేదనే డిక్లరేషన్‌తో పాటు అవసరమైన ధృవపత్రాలను సెప్టెంబర్ 16 లోపు సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవచ్చని సూచించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం అనంతరం అక్టోబర్ 19న ఎలాంటి తప్పులు లేని తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు.

