కలం, వెబ్ డెస్క్: ఉద్దేశపూర్వకంగా అబద్ధాలను పదేపదే చెప్తూ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) డిమాండ్ చేశారు. ఉనికిలోనే లేని అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి ఉన్నట్లుగా విష ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ వేదికగా అవాస్తవాలను చెప్పి సభను, ప్రజలను, సమాజాన్ని తప్పుదారి పట్టించిన హరీశ్‌రావు.. ప్రజాస్వామ్య విలువలను మంట గలిపారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని చందంగా కొత్వాల్‌గూడ, వట్టినాగులపల్లి మైనింగ్, భూముల అంశాన్ని ప్రస్తావించి రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చేసిన సవాల్‌కు కట్టుబడి నిజాన్ని నిరూపించలేకపోయిన హరీశ్‌రావు తాను వేసుకుంటానన్న శిక్షకు సిద్దం కావాలన్నారు.
ఒక కుటుంబ భూ వివాదంతో సంబంధమేంటి?
వట్టినాగులపల్లిలో ఒక కుటుంబానికి చెందిన 27 ఎకరాల భూమిలో రెండున్నర ఎకరాలు వివాదంలో ఉన్నదని, హైకోర్టులో విచారణ దశలో ఉన్నదని, దాన్ని ప్రస్తావించి మంత్రి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ హరీశ్‌రావు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని విప్ వేముల వీరేశం వ్యాఖ్యానించారు. ఆ భూ యజమానులతో హరీశ్‌రావు, కేటీఆర్‌కు ఉన్న లావాదేవీలు, లోపాయకారీ ఒప్పందమేంటని ప్రశ్నించారు. ఆ వివాదాన్ని అవకాశంగా వాడుకుని బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కుట్ర అని ఆరోపించారు. ఆ భూమిలో నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ సరిగ్గా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఎందుకు నెత్తికెత్తుకున్నారని వేముల వీరేశం ప్రశ్నించారు. వివాదాస్పద భూమి విషయంలో ఆ కుటుంబ సభ్యులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, పూర్తి ప్రైవేటు వ్యవహారాన్ని మంత్రికి ఆపాదించడం హేయమైన చర్య అని (Vemula Veeresham) అన్నారు.
మంత్రిని, ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర
హరీశ్‌రావు చెప్తున్న కొత్వాల్‌గూడ దగ్గర మైనింగ్ యాక్టివిటీ లేదని, స్టోన్ క్రషింగ్ మాత్రమే జరుగుతున్నదని, అది కూడా తిరుమల కన్‌స్ట్రక్షన్స్ అనే మరో కంపెనీకి చెందిన వ్యవహారమని వేముల వీరేశం గుర్తుచేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో మంత్రి పొంగులి శ్రీనివాసరెడ్డి, ఆయ భార్య మాధురి, కుమారుడు హర్ష తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారని, ఆ కంపెనీయే మైనింగ్ చేస్తున్నదంటూ హరీశ్‌రావు అసెంబ్లీ వేదికగా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2013లోనే ఆ కంపెనీ డైరెక్టర్‌గా వైదొలిగారని, ఆ తర్వాతనే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారని, 13 ఏండ్ల తర్వాత కూడా హరీశ్‌రావు పాత చింతకాయ పచ్చడి ప్రస్తావన చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి కుట్రపూరితంగా వ్యవహరించారని వేముల వీరేశం ఆరోపించారు. మంత్రి పొంగులేటి భార్య, కుమారుడు సైతం రెండేండ్ల క్రితం కంపెనీ డైరెక్టర్లుగా తప్పుకున్నారని గుర్తుచేశారు.
తప్పుడు వివరణలతో కన్‌ఫ్యూజన్
ప్రైవేటు భూమి, క్రషింగ్ యాక్టివిటీతో మంత్రి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకపోయినా అసెంబ్లీ వేదికగా విష ప్రచారానికి హరీశ్‌రావు పాల్పడ్డారని విప్ వేముల వీరేశం ఆరోపించారు. స్టోన్ క్రషింగ్ కోసం వాడుతున్న విద్యుత్‌కు సంబంధించిన బిల్లు తిరుమల కన్‌స్ట్రక్షన్స్ పేరుతోనే వచ్చిందన్నారు. వివాదంలో ఉన్న భూమి వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు సర్వే చేయాల్సిందిగా పల్లవి షా స్వయంగా లేఖ రాశారని గుర్తుచేశారు. కానీ కేటీఆర్ అండ్ కో మాత్రం వట్టినాగులపల్లి సందర్శన సందర్భంగా కొన్ని ఆరోపణలు చేయడంతో పాటు తనకు తెలియకుండానే సర్వే జరిగిందంటూ పల్లవి షా చెప్పడాన్ని కూడా వీరేశం తప్పుపట్టారు. కుట్రపూరితంగానే మంత్రిని బదనాం చేయాలని ముఖ్యమంత్రిని నిందించాలని హరీశ్‌రావు, కేటీఆర్‌లు ప్లాన్ చేశారని ఆరోపించారు. రాఘవ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో మంత్రి పొంగులేటి, భార్య, కుమారుడు లేనట్లయితే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రగల్భాలు పలికిన హరీశ్‌రావు ఇప్పుడు ఈ ఆధారాలను చూసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వీరేశం డిమాండ్ చేశారు.

