కలం, వెబ్ డెస్క్: చేనేత కార్మికులకు (Handloom Workers) ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీని నిలబెట్టుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందజేయనున్నది. ఈ పథకం రేపటి (మంగళవారం) నుంచి అమల్లోకి రాబోతున్నది. ఈ నిర్ణయం ద్వారా లక్షకుపైగా చేనేత కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది.
సాధారణ మగ్గాలు వినియోగించే చేనేతలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది. మర మగ్గాలు ఉపయోగించే వారికి 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందుబాటులోకి రానున్నది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం 1,04,488 చేనేత కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఏపీలో కొంతకాలంగా చేనేత రంగం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విద్యుత్ చార్జీలు, ముడి సరుకు ఖర్చులు పెరగడం వల్ల చిన్న స్థాయి వర్కర్లు (Handloom Workers) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. చేనేత ఉత్పత్తుల పోటీ సామర్థ్యం పెరగనున్నది.
గ్రామీణ ఉపాధికి ఊతం లభించడం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు దుర్బర పరిస్థితిని అనుభవిస్తున్నారు. చిన్న చేనేత కుటుంబాలకు నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఉపశమనం కలగబోతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో చేనేత రంగానికి మళ్లీ ఉత్సాహం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగ్ తీసుకురావాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: ఆ విషయంలో జగన్ క్రెడిట్ ను చోరి చేయలేరు: కొల్లు రవీంద్ర
Follow Us On : WhatsApp

