కలం, నల్లగొండ బ్యూరో: కార్మికుల సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టగానే మొసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమను ప్రదర్శిస్తున్నదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఆరోపించారు. హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో మూడు రోజుల్లోనే సమ్మెను ముగించడానికి తీసుకున్న చొరవ నిదర్శనమన్నారు. మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. సమ్మెను ఆపించేందుకు ఎంత తపన పడిందో ఉదయం మొదలు అర్ధరాత్రి వరకు దాదాపు 14 గంటల పాటు మంత్రులు, అధికారులు చర్చలు జరపడమే రుజువు అని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు జరిపి కొలిక్కి తెచ్చిందన్నారు. నిజానికి ఇప్పుడు కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నీ గత ప్రభుత్వంలో అపరిష్కృతంగా ఉన్నందున పేరుకుపోయినవేనని అన్నారు. ఆ ప్రభుత్వం ఇప్పటి తరహాలో చిత్తశుద్ధితో పరిష్కరించి ఉంటే ఇప్పుడు సమస్య అవసరమే తలెత్తేది కాదన్నారు. ఆనాడు చొరవ చూపకుండా అవహేళనగా మాట్లాడి కార్మికులను అవమానపరిచి, వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా కేసీఆర్ వ్యవహరించారని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించిందని, కార్మికుల పక్షాన నిలిచిందన్నారు.
సమ్మె సమయంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినవేనని, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రిమోటు సర్వీసుల్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న సుమారు 300 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్నామని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడం, వారి కుటుంబాలకు భరోసా కల్పించడం, వారి హక్కులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని (Vemula Veeresham) తెలిపారు.
Read Also: మంత్రి Vs ఎమ్మెల్యే.. వివేక్ నర్సాపూర్ పర్యటనలో రచ్చ
Follow Us On : WhatsApp

