కలం, వెబ్ డెస్క్ : దేశంలోనే సంపన్నమైన రాజకీయ కుంటుంబం.. కల్వకుంట్ల కుటుంబం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో దోచుకున్న సంపద అంతా కల్వకుంట్ల కుటుంబం దగ్గరే ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభతో కేటీఆర్ లో భయం కనిపిస్తోందన్నారు.
సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెబుతున్నారని వేముల ఫైర్ అయ్యారు. ఉద్యమంలో 1200 మంది బలిదానం, రక్తతర్పణం చేస్తే కల్వకుంట్ల కుటుంబం మాత్రం దోపిడీ చేసిందని ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేనేత సొసైటీలను కేటీఆర్ నిర్వీర్యం చేశారని.. మార్కెట్లను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. తన ఆస్తులపైన లెక్క తేల్చాలని.. అసెంబ్లీలో చర్చకు సిద్దమని ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
అమెరికా నుంచి తెచ్చిన డబ్బులతో హోటల్ పెట్టానని కేటీఆర్ బుకాయిస్తున్నారని వేముల వీరేశం విమర్శించారు. మూడు హోటళ్లకు సంబంధించిన ఆదాయం, ట్యాక్స్ వివరాలను కేటీఆర్ చూపించాలని చెప్పారు. ఒక హోటల్‌ను మూడు హోటల్ చేసే ట్రిక్కు తెలంగాణ యువతకు నేర్పించాలని వేముల ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో సమాజాన్ని పీల్చి పిప్పి చేసి సంపన్న రాజకీయ కుటుంబంగా ఎదిగారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

