కలం, వెబ్ డెస్క్: సిరిసిల్లలో బహిరంగ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) స్పందించారు. నల్లమల పులి అనుకునే రేవంత్ రెడ్డి.. సిరిసిల్ల సభకు నాలుగు వేల పోలీసుల బందోబస్తుతో వెళ్లాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదని.. చంద్రబాబు దగ్గర పిల్లి అంటూ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కేటీఆర్ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
రైతులు గోస పడుతున్నారు..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గంటలు కూడా కరెంట్ రావడం లేదని అవస్థలు పడుతున్నారని అన్నారు. ‘మోసపోకండి.. మోసపోతే గోసపడ్తం’ అని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనతో అన్నివర్గాల ప్రజలు గోస పడుతున్నారని అన్నారు. 50 ఏళ్లు ఏ కాంగ్రెస్ రైతులను సావగొట్టిందో అదే కాంగ్రెస్ ప్రజల మళ్లీ వచ్చి నెత్తి మీద కూర్చుందని మండిపడ్డారు.
రేవంత్ పాలనలో చేనేతల ఆత్మహత్యలు..
కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చే రూ. 80 వేల కోట్లు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రూ. లక్ష కోట్లు అవినీతి చేశారని తమపై చిల్లర మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ కొనుగోళ్ళు, ఫార్ములా ఈ రేసు మీద వేసిన కమిషన్ తుస్సుమన్నదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మళ్లీ 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. అమలవుతున్న బతుకమ్మ చీరలు, పిల్లల స్కూలు యూనిఫారమ్ ఆర్డర్లు ఆగిపోయాయన్నారు.
పరిహారం ప్రకటిస్తారని ఆశించా..
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ (CM Revanth Reddy) చనిపోయిన చేనేత కార్మికులకు రూ.10 నుంచి 20 లక్షల పరిహారం ప్రకటిస్తారని ఆశించానని.. కానీ అలాంటి ప్రకటన చేయలేదని కేటీఆర్ అన్నారు. ఆగిపోయిన నేతన్న బీమా గురించి చెబుతాడనుకుంటే.. శత్రుదేశం మీద దండయాత్రకు పోయినట్లు సిరిసిల్ల వెళ్లాడని ఎద్దేవా చేశారు. రేవంత్ పాలనలో తెలంగాణ ఆగం అయిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ ఘనవిజయం సాదిస్తుందని.. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

