ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి మాజీ మంత్రి అల్టిమేటం

కలం, నిజామాబాద్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై గత కొంతకాలంగా రైతుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా బీఆర్ఎస్ నేతలు రైతుల పక్షాన చేరి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్‌ను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని.. రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రేపటిలోగా సమస్య పరిష్కారం కాలేదంటే తానే ఆందోళనకు దిగుతానని ప్రభుత్వానికి వేముల అల్టిమేటం జారీ చేశారు.

కలెక్టర్ అందుబాటులో ఉండరా? : వేముల

క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను వేముల అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచే జిల్లా అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లైస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు . “ఒక ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఉండి అరగంట నుంచి ఫోన్ చేస్తుంటే కలెక్టర్ అందుబాటులోకి రాకపోవడం ఏంటి?” అంటూ అధికారులను ప్రశ్నించారు. రైతులు ఇక్కడ ఎండలో కష్టపడుతుంటే అధికారుల నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు.

రైస్ మిల్లు యాజమాన్యం అడ్డగోలు నిబంధనలు

కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ నుండి వెళ్తున్న ధాన్యానికి రైస్ మిల్లు యాజమాన్యం అడ్డగోలు నిబంధనలు పెడుతోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 41.5 కిలోలకు బదులు 44.5 కిలోలు (దాదాపు క్వింటాలుకు 10 కిలోల అదనపు తరుగు) ఇస్తేనే దించుకుంటామని లేకపోతే లారీలను దింపమని రైస్ మిల్లర్లు అనడం ఏమిటని అధికారులను నిలదీశారు. “నిబంధనలు పాటించని రైస్ మిల్లును సీజ్ చేయండి.. అప్పుడు అందరూ లైన్లోకి వస్తారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రెండు మిల్లులను సీజ్ చేసి దారికి తెచ్చాను” అని అధికారులకు వేముల గుర్తు చేశారు.

పాలసీ ఎవరు తయారు చేస్తారు?

పాలసీ ప్రభుత్వం తయారు చేస్తుందా? లేక రైస్ మిల్లర్లు తయారు చేస్తారా? అంటూ వేముల ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ఇంత చేతగానిదిగా ఎందుకు తయారైంది?” అని ప్రశాంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. తహసీల్దార్లు, ఇన్-ఛార్జ్ అధికారులు మిల్లర్లకు, రైతులకు మధ్య నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ 44.5 కిలోలు అడుగుతున్న మాట వాస్తవమేనని, తన దగ్గర వీడియో రికార్డింగ్ సాక్ష్యం కూడా ఉందని అధికారులకు స్పష్టం చేశారు.

తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

తరుగు లేకుండా ధాన్యంతో అన్-లోడింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, లారీల సంఖ్యను పెంచి రవాణాను వేగవంతం చేయాలని వేముల డిమాండ్ చేశారు. బోధన్, బాన్సువాడ ప్రాంతాల నుండి ట్రాన్స్ పోర్టు వెహికిల్స్ డైవర్ట్ చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>