కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి (Narender Reddy) అన్నారు. “డబ్బులు రాష్ట్రానివి.. డబ్బా బీజేపీది” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం నుంచి నిధుల వరద తీసుకొస్తామని మున్సిపల్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ (Bandi Sanjay) ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
యూఐడీఎఫ్ రుణం రాష్ట్ర ప్రభుత్వానిదే
కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (UIDF) కింద రూ.50 కోట్ల రుణాన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌కు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని నరేందర్‌రెడ్డి తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా వాటా లేదన్నారు.
యూసీఎఫ్‌లో రాష్ట్రానిదే అధిక వాటా
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద రూ.840 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.210 కోట్లు సమకూరుస్తుండగా, హడ్కో నుంచి తీసుకున్న రూ.420 కోట్ల రుణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 25 శాతం వాటా అంటే రూ.210 కోట్లు మాత్రమే ఇస్తున్నప్పటికీ, మొత్తం రూ.840 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. కరీంనగర్‌కు యూసీఎఫ్ తొలి విడతలో చోటు దక్కేలా కృషి చేసినందుకు బండి సంజయ్‌ను అభినందిస్తున్నామని, అయితే మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్న ప్రచారాన్ని మాత్రం ఖండిస్తున్నామని చెప్పారు.
స్మార్ట్ సిటీ నిధులపైనా సవాల్
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో మిగిలిన రూ.140 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.70 కోట్లు జమ చేసిందని నరేందర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా రూ.70 కోట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపుతోందని ఆరోపించారు. ఈ అంశాలపై బండి సంజయ్ తనతో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. UIDF మార్గదర్శకాల కాపీని బండి సంజయ్‌కు పంపిస్తానని తెలిపారు. తన కార్యాలయానికి వస్తే కేంద్ర బలగాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తారేమోనని, అందుకే పోస్టు ద్వారా పత్రాలు పంపిస్తానని అన్నారు.
యువత కోసం ప్రాజెక్ట్ తీసుకురావాలి
ఇప్పటికైనా మున్సిపల్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కేంద్రం నుంచి కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకురావాలని నరేందర్‌రెడ్డి కోరారు. ముఖ్యంగా యువత, నిరుద్యోగులకు ఉపయోగపడేలా ఏదైనా ప్రాజెక్టును కేంద్రం నుంచి తీసుకురావాలని సూచించారు. గత ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్‌కు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదంటూ గతంలో చేసిన విమర్శలను ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కరీంనగర్‌కు మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కరీంనగర్ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నట్లుగా భావించాల్సి వస్తుందని నరేందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్, కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, జగన్‌రెడ్డి, నాయకులు పిట్టల రవీందర్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, లాయక్, కుర్ర పోచయ్య, ఎండీ చాంద్, మామిడి సత్యనారాయణరెడ్డి, బషీర్, భారీ, హనీఫ్, సాయిరాం, రమణారెడ్డి, రాజ్‌కుమార్, ఖలీల్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

