కలం, నిజామాబాద్ బ్యూరో: థాయిలాండ్‌లో జరిగిన 9వ హీరోస్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో నిజామాబాద్ క్రీడాకారులు(Taekwondo Players) అద్భుత ప్రతిభ కనబరిచారు. నిజామాబాద్(Nizamabad) ఎన్ఆర్ఐ కాలనీలోని తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా (TMAAI)కి చెందిన ముగ్గురు క్రీడాకారులు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మొత్తం 4 పతకాలు సాధించారు. థాయిలాండ్‌లోని పట్టాయా ఈస్టర్న్ నేషనల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పోటీలలో 33 దేశాల నుంచి 4,403 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రపంచంలోని అత్యంత పోటీతో కూడిన తైక్వాండో ఈవెంట్లలో ఒకటిగా నిలిచిన ఈ చాంపియన్‌షిప్‌లో నిజామాబాద్ క్రీడాకారులు తమ సత్తా చాటారు.
నాలుగు పతకాలతో మెరుపు ప్రదర్శన
టీఎంఏఏఐకి చెందిన షేక్ మైతాబ్ అహ్మద్ (-81 కిలోలు) రెండు విభాగాల్లో పోటీ చేసి ఒక బంగారు, ఒక కాంస్య పతకం సాధించాడు. షేక్ తల్హా (-41 కిలోలు) అద్భుత ప్రదర్శనతో వెండి పతకం దక్కించుకున్నాడు. ఇల్హాన్ అబ్దుల్లా ఫారూకీ (-31 కిలోలు) పట్టుదల, పోరాట స్ఫూర్తితో కాంస్య పతకం సాధించాడు. ఈ విజయాలు టీఎంఏఏఐలో అందుతున్న క్రమశిక్షణ, అంకితభావం, ఉన్నతస్థాయి శిక్షణకు నిదర్శనంగా నిలిచాయి. అంతర్జాతీయ కోచ్, రిఫరీ, భారత గౌరవ రత్న సమ్మాన్ అవార్డు గ్రహీత డా. అబ్దుల్లా ఫారూకీ మార్గదర్శకత్వంలో ఈ క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో, నిజామాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
పతక విజేతలకు ఘన సన్మానం
థాయిలాండ్ నుంచి నిజామాబాద్‌కు తిరిగి వచ్చిన క్రీడాకారులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సాదరంగా స్వాగతించి సన్మానించారు. పతక విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి వారి విజయాలను అభినందించారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడలలోనూ చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. ఆరోగ్యకరమైన, విజయవంతమైన జీవితానికి శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమన్నారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి, బలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి దోహదపడతాయని అన్నారు. ముఖ్యంగా తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్‌లో విద్యార్థులు ఆసక్తితో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఆసియా, ఒలింపిక్స్‌లోనూ రాణించాలి
మాజీ ఉప మేయర్ మిర్ మజాజ్ అలీ సాహబ్ కూడా తన నివాసంలో తైక్వాండో విద్యార్థులను సన్మానించి పతక విజేతలను అభినందించారు. నిజామాబాద్‌కు చెందిన ఈ యువ క్రీడాకారులు భవిష్యత్తులో ఆసియా, ఒలింపిక్ స్థాయి పోటీలలో పతకాలు సాధించి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. యువ క్రీడాకారుల విజయాలు వారి తల్లిదండ్రులు, తైక్వాండో సమాజంతో పాటు మొత్తం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణంగా నిలిచాయి. కష్టపడి పనిచేయడం, అంకితభావం, క్రమశిక్షణతో అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటవచ్చని ఈ విజయం నిరూపించిందని నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్, తెలంగాణకు గౌరవం తీసుకురావడంతో పాటు ప్రపంచ తైక్వాండో వేదికపై భారతదేశ ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు.

