కలం, వెబ్ డెస్క్: కేరళం నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడీ సతీశన్ (VD Satheesan)ను ఏఐసీసీ (AICC) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం సుదీర్ఘంగా చర్చలు జరిపి, ఆయన పేరును ఖరారు చేసినట్లు సీనియర్ నేతలు జైరాం రమేశ్, దీపాదాస్ మున్షీ, అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ తదితరులు వెల్లడించారు. తొలుత 2001లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచిన సతీశన్‌కు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. గత ఎల్డీఎఫ్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా సమర్థవంతమైన పాత్ర పోషించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపచేయడంతో పాటు బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్రను గుర్తించిన రాష్ట్ర పార్టీ లీడర్లు, కేడర్ ఆయనకు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలని ఏఐసీసీకి వివరించారు. ముఖ్యమంత్రి రేసులో సతీషన్ పేరుతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేష్ చెన్నితల పేర్లు కూడా ఉన్నాయి. చివరకు సతీషన్‌కు ఆ అవకాశం దక్కింది.
ప్రస్తుతం కేరళం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా, ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన (VD Satheesan) గతంలో అసెంబ్లీ అంచనాల కమిటీ, పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్‌గా కూడా సేవలందించారు. ఈ విస్తృత అనుభవం నేపథ్యంలోనే పార్టీ ఆయనను అత్యున్నత పదవికి ఎంపిక చేసింది.
Read Also: మాజీ సీఎం న్యూ గెటప్.. న్యాయవాది దుస్తుల్లో కోర్టుకు!
Follow Us On: Instagram

