కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పర్యావరణవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కుటుంబానికి ప్రభుత్వం కీలక హామీలు ఇచ్చింది. కోట్లాది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah) వారసత్వాన్ని గౌరవిస్తూ, ఆయన జ్ఞాపకార్థం జూన్ నెలలో భారీ స్మారక వనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. అలాగే ఆయన సతీమణి జనమ్మకు ప్రత్యేక పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి వనజీవి రామయ్య సతీమణి జనమ్మ తన మనవడితో కలిసి వినతి పత్రం సమర్పించారు.
భర్త మరణానంతరం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆమె మంత్రికి ((Minister Ponguleti)) వివరించారు. సమస్యలను విన్న మంత్రి, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే సంబంధిత దరఖాస్తుపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రామయ్య నాటిన మొక్కల మధ్యే స్మారక వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం కుటుంబానికి సహాయం మాత్రమే కాకుండా, తెలంగాణ పర్యావరణ చరిత్రలో ఒక గుర్తింపుగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
Read Also: కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
Follow Us On : WhatsApp

