కలం, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు (Karimnagar Robbery Case)ను పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. బీహార్‌కు చెందిన సుభోద్ సింగ్ గ్యాంగ్ సభ్యులు ఐదుగురు రెండు నెలల క్రితమే తెలంగాణకు చేరుకున్నారు. రఘునాథ్ కర్మాకర్, రవీష్ కుమార్, రాధే, మిశ్రా, సూర్యమణి కుమార్ ఒక ముఠాగా ఏర్పడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. వీరికి బెంగాల్‌కు చెందిన మెహతాబ్ ఖాన్ పది వేల రూపాయలు తీసుకుని సిమ్ కార్డులు సమకూర్చాడు.
ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి ప్రాంతాల్లో తిరుగుతూ బ్యాంకులు, నగల దుకాణాలను గమనించిన ఈ ముఠా.. చివరకు కరీంనగర్‌లోని పీఎంజే షాపును లక్ష్యంగా చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ధర్మపురిలో ఉంటూ దోపిడీకి పక్కా ప్రణాళిక రచించారు. మే 2వ తేదీన గడ్ చందూర్ సమీపంలో సుభోద్ సింగ్ అనుచరులు రఘునాథ్ కర్మాకర్‌కు ఆరు పిస్టల్స్, మ్యాగజైన్లు అందజేశారు. అనంతరం బైక్ నంబర్ ప్లేట్లు మార్చేసి మే 3న దోపిడీకి తెగబడ్డారు.
పథకం ప్రకారం రాధే షాపులోకి ప్రవేశించి నగలతో ఉడాయించాడు. దోపిడీ తర్వాత నిందితులు ధర్మపురి మీదుగా పరారయ్యారు. సనోజ్, రాధే తమ బైక్‌ను గోదావరి నది ఒడ్డున వదిలి వెళ్లగా.. రఘునాథ్, మిశ్రా నగలతో కూడిన బ్యాగును అపాచీ బైక్‌పై గుండాల అడవులకు తీసుకెళ్లారు. అక్కడ సిద్ధంగా ఉన్న కెట్రా కారులో వచ్చిన వ్యక్తులకు నగలను అప్పగించి.. నిందితులు రైలు మార్గంలో బీహార్‌కు పారిపోయారు.

